బుర్కినా ఫాసోలో దారుణం జరిగింది. జిహాదీలు జరిపిన దాడుల్లో సుమారు 44 మంది మృతి చెందారు. చాలా మంది తీవ్రంగా గాయపడ్డారు. ఉత్తర ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు అక్కడి అధికారులు తెలిపారు. గ్రామాలే లక్ష్యంగా చేసుకుని దాడులు జరిగాయని వారు వెల్లడించారు. సెనో ప్రావిన్స్‌లోని కౌరకౌ, టోండోబి గ్రామాలపై జిహాదీలు దాడి చేశారు. "ఇది నీచమైన చర్య. అనాగరికమైనది కూడా. ఈ ప్రాంతంలో శాంతి భద్రతలు కాపాడేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ప్రజలు ప్రశాంతంగా ఉండాలి." అని ఆ ప్రాంత గవర్నర్ పీఎఫ్ రోడోల్ఫ్ సోర్గో అన్నారు.
పశ్చిమ ఆఫ్రికా దేశంలోని చాలా ప్రాంతాలు అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ఆధీనంలో ఉన్నాయి. ఈ సంస్థలు గత ఆరు సంవత్సరాలలో వేలాది మందిని పొట్టన బెట్టుకున్నాయి. వీరి కారణంగా ఇప్పటి వరకు రెండు మిలియన్ల మంది.. అల్-ఖైదా, ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ ప్రభావిత ప్రాంతాలను విడిచి వెళ్లారు. ప్రభుత్వాలు వీటిని నిర్మూలించేందుకు ఎన్ని ప్రయత్నాలు చేసిన.. అవి సఫలం కావట్లేదు.
పడవలు మునిగి 24 మంది వలసదారుల మృతి..
పడవలు మునిగిపోయిన ఘటనలో సుమారు 24 మంది వలసదారులు మృతి చెందారు. ట్యునీషియా సముద్ర జలాల్లో ప్రమాదం జరిగింది. రెండు రోజుల్లో వ్యవధిలో ఈ మరణాలు సంభవించాయని అధికారుల తెలిపారు. పడవలు ఓవర్‌లోడ్‌తో వెళుతున్నాయని.. అందుకే అవి ప్రమాదానికి గురయ్యాయని వారు పేర్కొన్నారు. తీరప్రాంత ఓడరేవు నగరమైన స్ఫాక్స్ ప్రాసిక్యూటర్ కార్యాలయం.. శనివారం ఈ వివరాలు వెల్లడించింది.
శనివారం కుడా ట్యునీషియా కోస్ట్ గార్డ్‌లో మరో ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు. ప్రమాదంలో చనిపోయిన నలుగురు సబ్-సహారా వలసదారుల మృతదేహాలను స్ఫాక్స్ తీరంలో జలాల నుంచి వెలికితీశామని వారు పేర్కొన్నారు. మరో 36 మందిని అధికారులు రక్షించారని వెల్లడించారు. వారిలో మరో ముగ్గురు గల్లంతయ్యారని పేర్కొన్నారు. "అంతకు ముందు జరిగిన పడవ ప్రమాదం వల్ల 20 మంది సబ్-సహారా వలసదారులు నీటిలో మునిగిపోయారు. అందులో ముగ్గురు పిల్లలు ఉన్నారు. వారందరిని రక్షించాం. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది." అని అధికారులు తెలిపారు.
ట్యునీషియా తీర జలాల నుంచి ఇటలీ ఒడ్డుకు చేరుకోవాలని చాలా మంది వలసదారులు ప్రయత్నిస్తున్నారని అధికారులు చెబుతున్నారు. ఈ సంవత్సరంలో వీరి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూ వస్తోందన్నారు. "శుక్రవారం, శనివారాల్లో చాలా మంది పడవలో వచ్చారు. వారందరిని తీర ప్రాంత రక్షణ సిబ్బంది అడ్డుకున్నారు." అని స్ఫాక్స్‌లోని ప్రాసిక్యూటర్ కార్యాలయ ప్రతినిధి ఫౌజీ మస్మౌడి తెలిపారు.