US Aid To Ukraine: సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్‌పై దాడులు ప్రారంభించిన రష్యా వాటిని ఇంకా కొనసాగిస్తోంది. అమెరికాతో పాటు ప్రపంచ దేశాలు కఠిన ఆంక్షలు విధిస్తున్నా.. ఉక్రెయిన్‌పై భీకర దాడులను రష్యా ఆపట్లేదు. మరోవైపు ఉక్రెయిన్ కూడా రష్యాను దీటుగానే ఎదుర్కొంటోంది. 45 రోజులకు పైగా జరుగుతున్న ఈ యుద్దంలో ఉక్రెయిన్‌కు ఇప్పటివరకు అమెరికా సహా ప్రపంచ దేశాలు అండగా నిలిచాయి. తాజాగా మరోసారి సాయం అందించనున్నట్లు అమెరికా ప్రకటించింది. 800 మిలియన్ డాలర్లు విలువ చేసే మిలిటరీ ప్యాకేజీని అందించనుంది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా దాడి చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో అమెరికా ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైడెన్ వెల్లడించారు. ఈ ప్యాకేజీలో భాగంగా అదనపు హెలీకాప్టర్లు, ఉక్రెయిన్ సాయుధ సిబ్బంది క్యారియర్లు, తీరప్రాంత రక్షణకు ఉపయోగించే నావికా డ్రోన్ నౌకలతో పాటు రసాయన, జీవ, అణు, రేడియోలాజికల్ దాడులలో సైనికులను రక్షించడానికి ఉపయోగించే పరికరాలను కూడా ఉక్రెయిన్‌కు అందిస్తామని తెలిపారు.
"తూర్పు ఉక్రెయిన్‌లో రష్యా దాడులు చేపట్టే అవకాశం ఉంది కాబట్టీ కొత్త ప్యాకేజీలో అత్యంత ప్రభావవంతమైన ఆయుధ వ్యవస్థలున్నింటినీ అందిస్తున్నాం. రష్యా దండయాత్రకు వ్యతిరేకంగా ఉక్రెయిన్ చేస్తున్న పోరాటంలో అమెరికాతో పాటు మిత్రదేశాలు ఉక్రెయిన్‌కు అందించిన ఆయుధాల సరఫరా కీలక పాత్ర పోషిస్తున్నాయి" అని బైడెన్ అన్నారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అభ్యర్థన మేరకు బైడెన్ ఈ కొత్త సహాయాన్ని ప్రకటించారు. ఫిబ్రవరి 24న రష్యా దాడి మొదలుపెట్టిన నాటి నుంచి అమెరికా అనేక విధాలుగా ఉక్రెయిన్‌కు సాయాన్ని అందించింది. ఇప్పటివరకు ఉక్రెయిన్ చేస్తున్న తిరుగుబాటులో అమెరికా అందించిన ఆయుధాలు ముఖ్యమైన పాత్ర పోషించాయి.
Ukraine President: ఉక్రెయిన్‌కు 800 మిలియన్ల డాలర్ల భారీ ప్యాకేజీని అందించడంపై ఆ దేశ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ అమెరికాకు కృతజ్ఞతలు తెలిపారు. బుధవారం ఉక్రెయిన్‌లో పర్యటించి.. తమ మద్దతు తెలిపిన పొలాండ్, ఎస్టోనియా, లిథోనియా, లట్వియా అధ్యక్షులకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. కొత్త ఆయుధాల రవాణా, రష్యాపై మరింత కఠిన ఆంక్షలు వంటి అంశాలపై అమెరికా అధ్యక్షుడు జోబైడెన్‌తో చర్చించినట్లు జెలెన్స్కీ తెలిపారు. ఉత్తర ఉక్రెయిన్‌లో రష్యన్ బలగాలు విడిచిపెట్టిన పదివేల పేలని షెల్‌లు, గనులు, ట్రిప్ వైర్‌లను తొలగించే పని కొనసాగుతోందని జెలెన్స్కీ వివరించారు. ఆయా పట్టణాల్లోని తమ ఇళ్లకు తిరిగి వచ్చేవారు.. తమ ప్రదేశాల్లో అనుమానాస్పదంగా ఎలాంటి వస్తువు కనిపించినా వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని హెచ్చరించారు.
ఇదీ చదవండి: Ukraine Russia Conflict: రష్యాకు బాల్టిక్ దేశాలు షాక్!