అమెరికా గగనతలంలో చైనా నిఘా బెలూన్.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తత పరిస్థితులకు దారితీసింది. అదీ అణుస్థావరం వద్ద బెలూన్ సంచరించడం వల్ల తీవ్రంగా పరిగణించింది. దీంతో విదేశాంగ మంత్రి ఆంటోనీ బ్లింకెన్ చైనా పర్యటనను వాయిదా వేసుకున్నారు. అయితే ఇప్పుడు మరో బెలూన్ వ్యవహారం వెలుగు చూసింది. లాటిన్ అమెరికా ప్రాంతంలో గగనతలంలో అనుమానాస్పదంగా సంచరిస్తున్న మరో బెలూన్‌ను అమెరికా రక్షణ శాఖ పెంటగాన్ ధ్రువీకరించింది. "ఒక బెలూన్ లాటిన్ అమెరికా దిశగా ప్రయాణిస్తున్నట్లు మేం గుర్తించాం. ఇది చైనా నిఘా బెలూన్‌గానే భావిస్తున్నాం" అని పెంటగాన్ ప్రెస్ సెక్రటరీ తెలిపారు.
అంతకుముందు గురువారం.. అమెరికా గగనతలంలో ఓ బెలూన్ సంచరించడం కలకలం రేపింది. మోంటానా(అమెరికాలోని మూడు భూగర్భ అణు క్షిపణి కేంద్రాల్లో ఒకటి)లో బెలూన్ ప్రత్యక్షమైందని పెంటగాన్ పేర్కొంది. అయితే అత్యంత ఎత్తులో ఎగరడం వల్ల విమానాల రాకపోకలకు దానివల్ల అంతరాయమేమీ కలుగలేదు. అయినప్పటికీ కీలక సమాచారం లీక్ అయ్యే ఛాన్స్ ఉండడం వల్ల.. అమెరికా జాగ్రత్త పడింది. దానిని పేల్చినా.. కూల్చినా.. ఎలాంటి పరిణామాలు సంభవిస్తాయోననే ఆందోళనతో కేవలం నిఘా మాత్రమే పెట్టింది అమెరికా రక్షణ శాఖ. తొలి బెలూన్ అలస్కా దాటేంత వరకు నిఘా పెడుతున్నట్లు తెలిపింది. అనంతరం కూల్చివేయడంపై నిర్ణయం తీసుకోనున్నట్లు వెల్లడించింది.
వాతావరణ సర్వే కోసమే: చైనా
ఈ వివాదంపై చైనా తన స్పందనను వెలువరించింది. ఆ బెలూన్ ఒక 'పౌర గగననౌక' అని తెలిపింది. వాతావరణ పరిశోధనల కోసం దానిని తామే ప్రయోగించామని స్పష్టం చేసింది. గాలుల ప్రభావంతో పాటు, స్వయంచోదక సామర్థ్యం పరిమితంగా ఉండటం వల్ల దశ తప్పి అమెరికా గగనతలంలోకి పొరపాటున వచ్చిందని వివరించింది. ఈ ఘటనపై చింతిస్తున్నట్లు చైనా పేర్కొంది. అయితే ఈ స్పందనతో అమెరికా సంతృప్తి చెందలేదు. మరింత సమగ్రమైన వివరణ కోసం అగ్రరాజ్యం పట్టుపడుతోంది.
గూఢచర్య బెలూన్ అంటే..
ఓ పెద్ద బెలూన్‌కు సౌర శక్తితో పనిచేసే కెమెరా, రాడార్ లాంటి పరికరాలను బిగించి పక్క దేశాల మీదకి గూఢచర్యానికి పంపిస్తే దానినే స్పై బెలూన్ అని అంటారు. ఇవి సుమారు 80 వేల నుంచి 1.20 లక్షల అడుగుల ఎత్తులో ప్రయాణిస్తాయి. వీటిని నేరుగా నియంత్రించలేరు. అయితే లక్ష్యం వైపు వీస్తున్న గాలికి అనుగుణంగా బెలూన్ ఎత్తును మార్చడం ద్వారా దాని దిశను మార్చేందుకు ప్రయత్నిస్తారు.
శాటిలైట్‌లు ఉండగా బెలూన్ ఎందుకో..
గూఢచర్యంలో శాటిలైట్‌లకున్న సామర్థ్యం ముందు బెలూన్‌లు దిగదుడుపే. అయితే ఇప్పుడు స్పై శాటిలైట్‌లను గుర్తించి, కూల్చేసే సాంకేతికత అందుబాటులో ఉంది. శత్రు దేశం వీటిని గుర్తించి కూల్చేస్తే ఆర్థిక నష్టం ఎక్కువగా ఉంటుంది. దీనికి భిన్నంగా బెలూన్‌ల ప్రయోగానికి అయ్యే ఖర్చు చాలా తక్కువ. అందుకే మళ్లీ వీటిపై ఆసక్తి పెరుగుతోంది.