Biden Taiwan: ద్వీపదేశం తైవాన్ ఆక్రమణకు చైనా గత కొన్నేళ్లుగా ప్రయత్నిస్తోంది. 1949లో చెలరేగిన అంతర్యుద్ధంతో చైనా, తైవాన్ విడిపోయాయి. అయినప్పటికీ స్వయంపాలనలో ఉన్న తైవాన్‌ను తమ నియంత్రణలోకి తీసుకుంటామని డ్రాగన్ బుసలు కొడుతోంది. తైవాన్ సమీపంలోకి యుద్ధనౌకలు, యుద్ధవిమానాలను పంపుతూ చైనా భయాందోళనలు కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో చైనా చర్యలకు ముకుతాడు వేసేలా అగ్రరాజ్యం అమెరికా తైవాన్‌కు అండగా నిలిచింది.
America Taiwan defence: తైవాన్ ఆక్రమణకు చైనా యత్నిస్తే.. తైవాన్‌కు తాము అండగా ఉంటామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ భరోసా ఇచ్చారు. తైవాన్‌కు మద్దతుగా సైనికపరంగా అమెరికా జోక్యం చేసుకుంటుందని ప్రకటించారు. ఉక్రెయిన్‌పై రష్యా సైనిక చర్య తర్వాత స్వయంపాలిత ద్వీపమైన తైవాన్ భద్రతకు మరింత ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. టోక్యోలో ఓ విలేకర్ల సమావేశంలో మాట్లాడిన బైడెన్.. తైవాన్‌కు వ్యతిరేకంగా చైనా బలగాలను ఉపయోగించే ప్రయత్నం మంచిది కాదని అన్నారు. బీజింగ్ అలాంటి చర్యలకు దిగితే ఆ ప్రాంతంలో అస్థిరత తలెత్తుతుందని అన్నారు. ఉక్రెయిన్ తరహా చర్య అవుతుందని అభిప్రాయపడ్డారు.
ప్ర: పలు కారణాలతో ఉక్రెయిన్ వివాదంలో మీరు సైనికపరంగా జోక్యం చేసుకోలేదు. తైవాన్‌ను రక్షించే విషయంలో సైనికపరమైన జోక్యం చేసుకునే అంశాన్ని పరిశీలిస్తారా?
జ: తప్పకుండా. కచ్చితంగా. మేము దానికి కట్టుబడి ఉన్నాం. కానీ ఆ పరిస్థితి వస్తుందని అనుకోవటం లేదు. వన్ చైనా విధానాన్ని మేము అంగీకరించాం. దానిపై సంతకాలు కూడా చేశాం. కానీ.. బలవంతంగా తైవాన్ ఆక్రమణకు యత్నిస్తే.. ఆ ప్రాంతమంతా అస్థిరత్వం ఏర్పడుతుంది. ఉక్రెయిన్ తరహా ఘటన అవుతుంది. అయితే అలా అవుతుందని నేను అనుకోవటం లేదు.--జో బైడెన్, అమెరికా అధ్యక్షుడు
తైవాన్ తొలి నుంచి అమెరికాకు సన్నిహితంగా మెలుగుతోంది. అమెరికా సైతం తైవాన్‌కు భారీగా ఆయుధాలను సరఫరా చేస్తోంది. అయినప్పటికీ చైనా దండెత్తితే సైనికపరమైన జోక్యం చేసుకుంటామని అమెరికా ప్రకటించడం ఇదే తొలిసారి. మరోవైపు అమెరికాలో ఆర్థిక మాంద్యం తలెత్తనుందన్న అంచనాలను బైడెన్ తోసిపుచ్చారు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం కారణంగా వస్తువుల సరఫరా తగ్గి, ద్రవ్యోల్బణం పెరిగినప్పటికీ అమెరికా ఆర్థిక సంక్షోభంలో చిక్కుకుంటుందని తాను భావించడం లేదని అన్నారు.