Mers Virus In Abu Dhabi : కొవిడ్ నుంచి ప్రపంచ దేశాలు ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నాయి. పలు దేశాల్లో మాత్రం కొవిడ్ తరహా కేసులు ఇంకా నమోదవుతూనే ఉన్నాయి. ఈ క్రమంలో కరోనా వైరస్ కుటుంబానికి చెందిన ప్రాణాంతక మెర్స్-కోవ్ (మిడిల్ ఈస్ట్ రెస్పిరేటరీ సిండ్రోమ్) మళ్లీ కలకలం రేపింది. అబుదాబీలో ఓ 28 ఏళ్ల యువకుడిలో మెర్స్-కోవ్ వైరస్ వెలుగు చూసింది. దీన్ని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) కూడా నిర్ధరించింది. అయితే, అతడు సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించి పరీక్షించగా.. ఎవ్వరికి మెర్స్-కోవ్ వైరస్ సోకలేదని తెలిపింది.
Mers Virus UAE : యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని అల్ ఐన్ నగరానికి చెందిన ఓ వ్యక్తి ఇటీవల అనారోగ్యం బారిన పడ్డాడు. దీంతో అతడిని స్థానిక ఆసుపత్రిలో చేర్పించారు. అనంతరం పీసీఆర్ పరీక్షలు జరపగా మెర్స్-కోవ్‌గా నిర్ధరణ అయ్యింది. అయితే.. అతడితో పాటు సన్నిహితంగా మెలిగిన 108 మందిని పరీక్షించగా.. ఎవ్వరిలోనూ వైరస్ జాడలు కనిపించలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో ఒంటెల వంటి జంతువుల నుంచే వైరస్ సోకి ఉండవచ్చని అనుమానించారు. ఇన్ఫెక్షన్ బారిన పడిన ఈ వ్యక్తి ఒంటెలతో సమీపంగా మెలిగిన దాఖలాలు లేవని తెలుస్తోంది. మరోవైపు.. ప్రస్తుతం అతడి ఆరోగ్య పరిస్థితిపైనా డబ్ల్యూహెచ్‌వో, యూఏఈ ఆరోగ్యశాఖ నుంచి ఎటువంటి ప్రకటనా రాలేదు.
Mers Virus Outbreak : మెర్స్-కోవ్ కరోనా వైరస్ (MERS-CoV) తొలిసారి 2012లో సౌదీ అరేబియాలో బయటపడింది. ఇప్పటివరకు ఈ వైరస్ బ్రిటన్, అమెరికాతో సహా 27 దేశాల్లో వెలుగు చూసింది. అత్యంత ప్రాణాంతకమైన ఈ వైరస్ సోకిన బాధితుల్లో 35శాతం మంది మరణించారు. మొత్తంగా ఇప్పటివరకు 2,605 కేసులు నమోదు కాగా.. 936 మంది మరణించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు తెలుపుతున్నాయి.
Mers Virus Symptoms : మెర్స్-కోవ్ను జూనోటిక్ వైరస్‌గా పరిగణిస్తారు. అంటే జంతువుల నుంచి మానవులకు సోకే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా సౌదీ అరేబియాలో ఈ కేసులు ఎక్కువగా బయటపడుతుంటాయి. ఇన్ఫెక్షన్కు గురైన ఒంటెల నుంచి మెర్స్-కోవ్ ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఈ వైరస్ సోకడం వల్ల జ్వరం, దగ్గు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో పాటు మరికొన్ని సమయాల్లో నిమోనియా లక్షణాలు కనిపిస్తాయి. ఈ వైరస్ సోకిన వ్యక్తుల్లో మరణాలు రేటు చాలా అధికంగా ఉంటోంది.