పక్షవాతాన్ని గుర్తించేందుకు అత్యవసరంగా నిర్వహించే స్కాన్లతో కొవిడ్-19ను కూడా గుర్తించే అవకాశం ఉందని బ్రిటన్ శాస్త్రవేత్తల తాజా అధ్యయనం తేల్చింది. దీంతో మెదడుకు గాయమైనట్లు అనుమానమున్న వారిలో కొవిడ్ బాధితులను త్వరగా గుర్తించి, వ్యాధి వ్యాప్తిని అడ్డుకోవడానికి వీలవుతుందని వివరించింది. లండన్‌లోని హైపర్ అక్యూట్ స్ట్రోక్ యూనిట్లలో 225 మంది రోగుల తల, మెడ భాగాల్లోని రక్త నాళాలకు నిర్వహించిన అత్యవసర కంప్యూటెడ్ టొమోగ్రఫీ (సిటీ) స్కాన్‌ను పరిశీలించారు. ఇందులో ఊపిరితిత్తుల్లోని పైభాగాలూ కనిపించాయి. అక్కడ గ్రౌండ్ గ్లాస్ ఒపేసిఫికేషన్ తీరులో జరిగిన మార్పుల ఆధారంగా కొవిడ్‌ను గుర్తించొచ్చని శాస్త్రవేత్తలు తేల్చారు. వాటి ద్వారా కొవిడ్ మరణాలనూ ముందుగానే అంచనా వేయవచ్చని తెలిపారు.
ప్రస్తుతం కరోనా వైరస్‌ను గుర్తించటానికి నిర్వహిస్తున్న ఆర్టీ పీసీఆర్ పరీక్షకు చాలా సమయం పట్టడంతో పాటు కొన్నిసార్లు ఫలితాల్లో తేడాలూ వస్తున్న నేపథ్యంలో ఈ పరిశోధనకు ప్రాముఖ్యత ఏర్పడిందని పేర్కొన్నారు. ఇలాంటి రోగులు మాస్కులు ధరించడం కష్టమని, అందువల్ల వారికి కొవిడ్-19 కూడా సోకినట్లు ముందే తెలిస్తే ఆసుపత్రి సిబ్బంది మరింత జాగ్రత్తగా ఉండటానికి వీలవుతుందని తెలిపారు.