Birth Rates in China: వివాహ రిజిస్ట్రేషన్ల సంఖ్య గణనీయంగా పడిపోవడం, వైవాహిత జంటల వృద్ధాప్యం కారణంగా చైనాలో జననాల రేటు మునుపెన్నడూ లేని అత్యల్ప స్థాయికి పడిపోయింది. ఈ మేరకు ఓ మీడియా కథనం పేర్కొంది. ఈ నివేదిక వివరాలు ఎలా ఉన్నాయంటే..
- 2019లో తొలి మూడు త్రైమాసికాలతో పోలిస్తే 2020లో చైనాలో 17.5 శాతం వివాహాలు తగ్గిపోయాయి.
- ఐదేళ్లుగా జియాంగ్సు ప్రావిన్స్‌లో వివాహాల నమోదు క్రమంగా పడిపోతూ వస్తోంది.
- ఝెజియాంగ్ రాజధాని హాంగ్జౌలో 2011తో పోలిస్తే 2021లో 80 శాతం వివాహాల రిజిస్ట్రేషన్లు తగ్గిపోయాయి.
- అదే సమయంలో పెళ్లి చేసుకుంటున్న వారిలో 46.5 శాతం మంది వయసు 30 ఏళ్లకు పైగా ఉంది.
- దశాబ్దాల పాటు అమలైన అమానుషమైన వన్ చైల్డ్ పాలసీకి ఈ కారణాలు తోడవడం వల్ల జననాల రేటు కనిష్ఠానికి పడిపోయింది.
- నేషనల్ బ్యూరో ఆఫ్ స్టాటిస్టిక్స్ ఆఫ్ చైనా డేటా ప్రకారం 2021లో చైనా జననాల రేటు 7.52కి క్షీణించింది.
కఠిన చర్యలు తీసుకున్నా..
అయితే జననాల రేటును పెంచేందుకు.. శరీరంపై స్వయంప్రతిపత్తి లాంటి మహిళల కనీస హక్కులను కాలరాసే విధానాలను కొన్నేళ్లుగా చైనా అవలంబిస్తోందనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. మహిళల హక్కులు, ఆశయాల కోసం ఇటీవలే ఆ దేశంలో తీసుకొచ్చిన చట్టం కూడా వారిని వస్తువులుగా భావించే విధంగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. ఇక ఫ్యామిలీ ఎడ్యుకేషన్ ప్రమోషన్ లాలో కుటుంబ విలువలను పెంపొందించేందుకు మహిళలు ప్రత్యేక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు.
వన్ చైల్డ్ పాలసీ వల్ల జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు చైనా కమ్యూనిస్టు పార్టీ అధికారులు.. అబార్షన్లు, వాసేక్టమీలను నిరుత్సాహపరిచే చర్యలు తీసుకుంటున్నారు. యువ జంటలకు ఆసక్తి ఉన్నప్పటికీ షాంఘై, బీజింగ్, గువాంగ్జౌలోని 12 ఆస్పత్రుల్లో వాసెక్టమీ చేయడం నిలిపేశారని వాషింగ్టన్ పోస్ట్ దర్యాప్తులో తేలింది. అయితే ఇన్ని చర్యలూ తీసుకున్నప్పటికీ జననాల రేటు మెరుగుపరచడంలో ఎలాంటి ప్రభావం చూపడంలేదని ప్రభుత్వ డేటా ప్రకారం తేటతెల్లమవుతోంది.
ఇదీ చూడండి: ఆ దేశంలో జనాభా సంక్షోభం.. దారుణంగా దెబ్బతీసిన కరోనా