Ukraine Russia News: ఉక్రెయిన్ విషయంలో దూకుడుగా వ్యవహరిస్తున్న రష్యా.. సరిహద్దుల్లో యుద్ధ విమానాలను మోహరిస్తోంది. తన మిత్రదేశమైన బెలారస్‌లో అణ్వాయుధ సామర్థ్యంగల రెండు టీయూ-22ఎం3 యుద్ధ విమానాలను రష్యా మోహరించింది. బెలారస్ మీదుగా ఉక్రెయిన్‌పై దాడి చేసేందుకే రష్యా వాటిని మోహరించినట్లు అనుమానం వ్యక్తమవుతోంది.
తమ బాంబర్లు బెలారస్ వైమానిక దళంతో కలిసి 4 గంటల పాటు సైనిక విన్యాసాల్లో పాల్గొన్నాయని రష్యా రక్షణ మంత్రిత్వశాఖ పేర్కొంది. ఈ సైనిక విన్యాసాల కోసం సైబీరియా సహా సుదూర ప్రాంతాల్లోని బలగాలను బెలారస్‌కు తరలించింది. రష్యా యుద్ధ విమానాలు, ఉక్రెయిన్ ఉత్తర సరిహద్దు ప్రాంతాల మీదుగా ప్రయాణించాయి.
ఇప్పటికే ఉక్రెయిన్ సరిహద్దులో దాదాపు లక్ష మందిని రష్యా మోహరించింది. తద్వారా ఉక్రెయిన్‌ను ఆక్రమించుకోవాలని రష్యా ప్రయత్నిస్తున్నట్లు అమెరికా, మిత్రదేశాలు ఆరోపిస్తున్నాయి. ఉక్రెయిన్‌పై దాడి వార్తలను ఖండిస్తున్న రష్యా.. నాటోలో ఆ దేశాన్ని చేర్చుకోరాదని, ఆధునిక ఆయుధాలను ఉక్రెయిన్‌లో మోహరించవద్దని, తూర్పు ఐరోపాలో బలగాలను ఉపసంహరించుకోవాలని అమెరికాను డిమాండ్ చేస్తోంది. రష్యా డిమాండ్లను అమెరికా సహా నాటో దేశాలు తోసిపుచ్చుతున్నాయి.
ఇదీ చూడండి: Gandhi statue vandalised: గాంధీ కాంస్య విగ్రహం ధ్వంసం