శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు వ్యవస్థది అత్యంత కీలక పాత్ర. ప్రజా జీవనంలో కలిసిపోయి నేరాలకు తెగబడే నేరస్థులను పట్టుకొని వారికి శిక్ష పడేలా చేయటం ద్వారా సమాజంలో శాంతి స్థాపనకు పోలీసులు కృషి చేస్తారు. అయితే ముష్కర మూకల వశమైన అఫ్గానిస్థాన్‌లో (Taliban Afghanistan) తాలిబన్లే పోలీసులుగా అవతారమెత్తారు. ఆయుధాలు ధరించి వీధుల్లో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఏకే-47, అమెరికా తయారు చేసిన ఏం16 రైఫిల్స్ పట్టుకొని వీధుల్లో తమ ఉనికి చాటుకుంటున్నారు. వీధుల్లో గొడవలకు దిగుతున్న వారిని పట్టుకుంటూ అనుమానిత నేరస్థులకు (Taliban Latest News) పోలీసు స్టేషన్‌లకు రావాలని ఆదేశాలు జారీ చేస్తున్నారు. తమ ఆజ్ఞలను ధిక్కరించిన వారిని వెంబడించి మరీ పట్టుకొని జైళ్లల్లో బంధిస్తున్నారు. ముష్కర మూకల పాలనలో తమ స్వేచ్ఛా స్వాతంత్రాలు పూర్తిగా కోల్పోయామని అఫ్గాన్ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
"ఇక్కడి వ్యక్తులు వేర్వేరు నేరాలకు పాల్పడ్డారు. వారిలో కొందరు హత్యలు చేశారు, మరికొందరు దొంగతనాలకు పాల్పడ్డారు. ఇంకొందరు తుపాకులు, కత్తులతో పట్టుబడ్డారు. ప్రస్తుతం వారికి శిక్ష విధించేందుకు న్యాయస్థానానికి తరలిస్తున్నాం."
-తాలిబన్ అధికారి
"ఇక్కడ ఎలాంటి చట్టం లేదు. మా న్యాయవ్యవస్థ కనుమరుగై పోయింది. ఇక్కడి పురుషులు మూసిన తలుపులు వెనక నుంచి మా గోడును వినిపించుకోవాల్సి వస్తోంది. మీరు ఒకసారి వారికి(తాలిబన్లు) పట్టుబడితే, ఇక అంతా ముగిసినట్లే."
-షా పోపాల్, కాబుల్ నివాసి
"మేము కొన్ని సంవత్సరాలుగా పోరాడుతూ ఎన్నో త్యాగాలు చేశాం. దేవుడి దయతో మేం అధికారం చేపట్టి ఈ స్థాయికి చేరుకున్నాం. మేము కష్టపడ్డాం, ఎన్నో ప్రయత్నాలు చేశాం. ప్రస్తుతం నేను ఇచ్చే ప్రతి తీర్పు షరియా చట్టం ప్రకారమే ఉంది. షరియా చట్టాన్ని అమలు చేయడానికే మేం వచ్చాం. ఇస్లాం పండితులు న్యాయమూర్తుల స్థానాన్ని తీసుకున్నారు. వారు ఇచ్చే తీర్పు ప్రతిదీ షరియా చట్టాన్ని అనుసరించే ఉంటాయి."
-షైర్, తాలిబన్ న్యాయమూర్తి
అఫ్గానిస్థాన్‌లో తొలిసారి 1990వ దశకంలో తాలిబన్లు అధికారాన్ని (Taliban Afghanistan) చేపట్టగా షరియా చట్టం పేరుతో కఠిన చట్టాలను అమలు చేశారు. దొంగతనానికి పాల్పడితే చేతులు నరకటం, హత్య చేసిన వారి తలపై తుపాకీతో కాల్చటం వంటి అనాగరిక శిక్షలు అమలు చేశారు. రెండో దఫా అధికారం చేపట్టిన తర్వాత కూడా ఈ తరహా శిక్షలనే అమలు చేస్తామని ఇప్పటికే తాలిబన్లు ప్రకటించారు. ఇందులో భాగంగానే ఇటీవల హెరాత్ పట్టణంలో ఓ వ్యక్తిని బహిరంగంగా ఉరి తీశారు. బాధితుడు కిడ్నాప్‌కు యత్నించాడని ఆరోపిస్తూ క్రేన్‌కు వేలాడ తీశారు. అలాగే కాబుల్‌లో చిన్న చిన్న దొంగతనాలకు పాల్పడుతున్న ఇద్దరిని తాలిబన్లు అవమానకరంగా వీధుల్లో ఊరేగించారు. చేతులకు సంకెళ్లు వేసి, నోటిలో కుళ్లిపోయిన బ్రెడ్ ఉంచి రోడ్లపై తిప్పారు.
ఇదీ చూడండి : ఐసిస్‌పై తాలిబన్ల రివెంజ్- అనేక మంది హతం!