తైవాన్ను ఆక్రమించుకోవాలని చూస్తున్న చైనా.. ఆ దేశంపై ఒత్తిడి (Taiwan China news) పెంచేందుకు ప్రయత్నిస్తోంది. ఆదివారం తైవాన్ గగనతలంలోకి మరోసారి యుద్ధవిమానాలను (China Taiwan news today) పంపించింది. మొత్తం 27 విమానాలు తమ బఫర్ జోన్లోకి ప్రవేశించాయని తైవాన్ రక్షణ శాఖ వెల్లడించింది. చైనా విమానాలు తైవాన్ పరిధిలో నుంచి వెళ్లిపోవాలని.. తమ యుద్ధవిమానాల ద్వారా హెచ్చరించినట్లు పేర్కొంది.
మొత్తం 18 ఫైటర్ జెట్లు, ఐదు హెచ్-6 బాంబర్లు, గాల్లో ఇంధనం నింపగలిగే వై-20 ఎయిర్‌క్రాఫ్ట్ సైతం తమ గగనతలంలోకి ప్రవేశించాయని వివరించింది. ద్వీపదేశమైన తైవాన్ దక్షిణ భాగం నుంచి చైనా విమానాలు చొరబడ్డాయని ఆ దేశం విడుదల చేసిన మ్యాప్‌లను బట్టి తెలుస్తోంది. పసిఫిక్ మహాసముద్రం మీదుగా వెళ్లిపోయాయని అధికారులు తెలిపారు.
4 రోజుల్లో 150 విమానాలు
గత ఏడాది కాలంగా తైవాన్‌పై తన ఆధిపత్యాన్ని ప్రదర్శించుతూ ఒత్తిడి పెంచుతోంది చైనా. ఇటీవల నాలుగు రోజుల వ్యవధిలో 150కి పైగా యుద్ధ విమానాలను ఆ దేశం మీదకు ఉసిగొల్పింది.
తైవాన్ను తన అంతర్భాగంగా పరిగణించే చైనా.. ఆ దేశాన్ని పూర్తిగా తమలో కలుపుకుంటామని, అవసరమైతే సైనిక చర్యకూ వెనకాడబోయేది లేదని చెబుతోంది. 1949 సివిల్ వార్ సమయంలో తైవాన్, చైనా విడిపోయాయి. అప్పటి నుంచి ఆ దేశ స్వయం ప్రతిపత్తిని గుర్తించేందుకు డ్రాగన్ విముఖత వ్యక్తం చేస్తోంది. అంతర్జాతీయ వేదికల్లో తైవాన్ భాగస్వామ్యం కావడాన్నీ వ్యతిరేకిస్తోంది.
ఇదీ చదవండి: తైవాన్ ఆక్రమణకు చైనా తహతహ- అగ్రరాజ్యం కన్నెర్ర!