పంజ్‌షేర్‌లో తాలిబన్లకు(Afghan Taliban) వ్యతిరేకంగా పోరు కొనసాగుతుందని అఫ్గాన్ మాజీ ఉపాధ్యక్షుడు అమ్రుల్లా సలేహ్(Amrullah Saleh) ప్రకటించారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా స్పందించారు. 'యుద్ధం ముగిసిపోలేదు.. నా మాతృభూమి కోసం అది కొనసాగుతోంది. నేను దాని గౌరవాన్ని కాపాడుతున్నా.' అని సలేహ్ శుక్రవారం ట్వీట్ చేశారు. అలాగే తాను పంజ్‌షేర్‌ను విడిచి పోయినట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు.
"నేను పంజ్‌షేర్‌లోనే ఉన్నా. తాలిబన్ వ్యతిరేక దళాలు, తాలిబన్ ఫైటర్లు మధ్య ఘర్షణ కొనసాగుతోంది. అలాగే తాలిబన్లు యుద్ధ నేరాలకు పాల్పడుతున్నారు. మానవ హక్కులను కాలరాస్తున్నారు. తాలిబన్ల అనాగరిక చర్యలను అడ్డుకోవాలని అంతర్జాతీయ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా."
-'టోలో న్యూస్‌తో అమ్రుల్లా సలేహ్
యావత్ దేశాన్ని తమ వశం చేసుకున్న తాలిబన్లు(Taliban News) పంజ్‌షేర్‌ను హస్తగతం చేసుకునేందుకు భారీగా ఆయుధాలు, బలగాలతో వెళ్లారు. పంజ్‌షేర్ తమ వశం అవటం ఖాయంగా భావించిన వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. గత బుధవారం బదక్షన్‌లోని అంజుమాన్ మార్గం ద్వారా తాలిబన్లు పంజ్‌షేర్‌లోకి(Punjshir Valley) ప్రవేశించే ప్రయత్నం చేశారు. అయితే.. ఎన్ఆర్ఎఫ్ దళాలు ఎదురుదాడికి దిగాయి, ముష్కరమూకలపై తూటాల వర్షం కురిపించాయి. దాంతో తాలిబన్లు తోకముడుచుకుని వెనుదిరగక తప్పలేదు. ఈ పోరులో తాలిబన్లకు భారీ ప్రాణనష్టం జరిగినట్లు స్థానిక మీడియా పేర్కొంది.
మరోవైపు అఫ్గానిస్థాన్‌లో ఏర్పాటు కాబోయే ప్రభుత్వానికి తాలిబన్ సహ వ్యవస్థాపకుడు ముల్లా బరదార్ నాయకత్వం వహిస్తారని స్థానిక మీడియా పేర్కొంది.
ఇవీ చదవండి: