పాకిస్థాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ రాజకీయ పునరాగమనం చేయనున్నారు. రెండేళ్ల తర్వాత క్రియాశీల రాజకీయాల్లోకి ప్రవేశించనున్నట్లు తెలుస్తోంది. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు ప్రారంభించే లక్ష్యంతో ఆదివారం నిర్వహించే ప్రతిపక్ష పార్టీల సమావేశానికి వర్చువల్‌గా హాజరుకావాలని షరీఫ్‌ను ఆహ్వానించారు పాకిస్థాన్ పీపుల్స్ పార్టీ (పీపీపీ) ఛైర్మన్ బిలవాల్ బుట్టో జర్దారీ.
ఈ నెల 18న షరీఫ్‌తో ఫోన్లో మాట్లాడారు పీపీపీ ఛైర్మన్ జర్దారీ. ఆదివారం నిర్వహించ తలపెట్టిన విపక్షాల సమావేశానికి వర్చువల్‌గా హాజరుకావాలని ఆహ్వానించారు. ఇమ్రాన్ ప్రభుత్వం ధరల పెరుగుదల, పేదరికాన్ని అరికట్టటంలో విఫలమైనట్లు ఆరోపించారు.
" ఇప్పుడే నవాజ్ షరీఫ్‌తో మాట్లాడాను. ఆయన ఆరోగ్యం గురించి అడిగి తెలుసుకున్నా. సెప్టెంబర్ 20న పీపీపీ నేతృత్వంలో నిర్వహించే విపక్షాల సమావేశానికి వర్చువల్‌గా హాజరుకావాలని ఆహ్వానించా."
- బిలవాల్ బుట్టో జర్దారీ, పీపీపీ ఛైర్మన్
మరియం కృతజ్ఞతలు..
షరీఫ్‌ను ఆహ్వానించటం పట్ల పీపీపీ ఛైర్మన్ బిలవాల్కు కృతజ్ఞతలు తెలిపారు ఆయన కూతురు మరియం. అయితే..పాకిస్థాన్ ముస్లిం లీగ్-నవాజ్ (పీఎంఎల్-ఎన్) పార్టీ ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు అధికారికంగా ధ్రువీకరించలేదు. కానీ, షరీఫ్ వర్చువల్‌గా హాజరవుతారని పార్టీ సెనేటర్ ముసదిక్ మలిక్ ఓ మీడియా సంస్థతో తెలిపారు. మరియం నవాజ్ కూడా హాజరుకానున్నట్లు చెప్పారు.
విపక్షాల అత్యన్నత స్థాయి సమావేశానికి హాజరవటం వల్ల షరీఫ్ పార్టీ పీఎంఎల్-ఎన్ను పునరుజ్జీవనం చేయటం సహా.. ప్రభుత్వ వ్యతిరేక నిరసనలకు మరింత ఆజ్యం పోసినట్లవుతుంది. అయితే... షరీఫ్‌పై నాన్‌బెయిలేబుల్ అరెస్ట్ వారెంట్ జారీ చేసిన క్రమంలోనే క్రియాశీల రాజకీయాల్లోకి రావాలనుకోవటం ప్రాధాన్యం సంతరించుకుంది.
రెండు కేసుల్లో బెయిల్‌పై..
అవెన్‌ఫీల్డ్ ఆస్తుల కేసులో.. షరీఫ్‌తో పాటు ఆయన కూతురు మరియం, అల్లుడు మహమ్మద్ సఫ్దార్లపై 2018, జులై 6న కేసు నమోదైంది. 2017లో ప్రధాని పదవి కోల్పోయిన ఆయనకు..ఆల్ అజీజ్ స్టీల్ మిల్స్ కేసులో ఏడేల్ల శిక్ష పడింది. ఈ రెండు కేసుల్లో బెయిల్ పొందిన ఆయన ఎనిమిది వారాల చికిత్స నిమిత్తం లండన్ వెళ్లి అక్కడే ఉండిపోయారు. ఆరోగ్య సమస్యల కారణంగానే స్వదేశానికి రాలేకపోతున్నట్లు ఆయన న్యాయవాది తెలిపారు.
ఇదీ చూడండి: పాక్ మాజీ ప్రధానిపై అరెస్ట్ వారెంట్