Imran khan Tv Debate With Modi: భారత్, పాకిస్థాన్ మధ్య ఉన్న వేర్వేరు వివాదాల పరిష్కారమే లక్ష్యంగా ప్రధాని నరేంద్ర మోదీతో టీవీ డిబేట్లో పాల్గొనాలని కోరుకుంటున్నట్లు చెప్పారు పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్. ఆ చర్చ ద్వారా ద్వైపాక్షిక సమస్యలు పరిష్కారమైతే.. ఉపఖండంలోని 100 కోట్లకుపైగా ప్రజలకు మంచి జరుగుతుందని అభిప్రాయపడ్డారు.
ప్రస్తుతం రెండు రోజుల రష్యా పర్యటనలో ఉన్న ఇమ్రాన్.. మాస్కోలో ఓ టీవీ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు. "2018లో మా పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే భారత్‌కు చర్చల ప్రతిపాదన చేశాము. కూర్చుని, మాట్లాడుకుని కశ్మీర్ వివాదాన్ని పరిష్కరించుకుందామని ప్రతిపాదించాము. కానీ దురదృష్టవశాత్తూ భారత్ సానుకూలంగా స్పందించలేదు." అని అన్నారు పాక్ ప్రధాని.
భారత్ వైఖరి సుస్పష్టం
2016లో పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై ఉగ్రదాడి తర్వాత భారత్- పాక్ సంబంధాలు దెబ్బతిన్నాయి. తర్వాత ఉరీలోని సైనిక స్థావరంపై దాడి, పుల్వామా దాడి, ఆర్టికల్ 370 రద్దుతో పరిస్థితి మరింత దిగజారింది. ఉగ్రవాదులకు కొమ్ముకాస్తూనే చర్చల ప్రతిపాదన చేసే పాక్‌కు భారత్ ఇప్పటికే అనేకసార్లు తన వైఖరిని స్పష్టం చేసింది. జమ్ముకశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమని.. ఈ విషయంలో మరో మాటకు ఆస్కారం లేదని తేల్చిచెప్పింది. వాస్తవాన్ని అర్థం చేసుకుని భారత వ్యతిరేక ప్రచారాన్ని మానుకోవాలని పొరుగు దేశానికి హితవు పలికింది.
ఇదీ చూడండి: 'భాజపా ఐదేళ్లలో చేసిన అభివృద్ధి.. వచ్చే 25ఏళ్లకు పునాది'