పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్‌లో తొలి హిందూ దేవాలయ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది స్థానిక హైకోర్టు. నిధుల మంజూరును అడ్డుకోలేమని స్పష్టం చేసింది. ఆలయ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టివేసింది.
హిందూ దేవాలయ నిర్మాణాన్ని సవాల్ చేస్తూ దాఖలైన మూడు పిటిషన్లను జస్టిస్ అమెర్ ఫరూక్ నేతృత్వంలోని ధర్మాసనం విచారించింది. ఆలయ నిర్మాణానికి నిధులు మంజూరు చేసిన స్థానిక హిందూ పంచాయతీని ఈ విషయంలో అడ్డుకోలేమని స్పష్టం చేసింది. అభిప్రాయం తెలుసుకునేందుకు ఈ అంశాన్ని ఇస్లామిక్ భావజాల మండలికి నివేదించుకోవచ్చని సూచించింది.
ఆలయ నిర్మాణాన్ని రద్దు చేయాలని కోరారు పిటిషనర్లు. రాజధాని అభివృద్ధిలో భాగంగా గుడికి భూకేటాయింపులపై ఎలాంటి నిబంధనలు లేవని తెలిపారు. అయితే.. అన్ని వర్గాలతో సంప్రదించిన మీదటే భూ కేటాయింపులు జరిగినట్లు వివరణ ఇచ్చింది రాజధాని అభివృద్ధి ప్రాధికార సంస్ధ.
ఇస్లామాబాద్‌లోని తొమ్మిదవ పరిపాలనా డివిజన్‌లో 20వేల చదరపు అడుగుల్లో శ్రీ కృష్ణ ఆలయ నిర్మాణానికి ఇటీవలే భూమి పూజ జరిగింది. అక్కడే సామాజిక కేంద్రం, స్మశానవాటిక నిర్మించేలా ప్రణాళిక రూపొందించారు.
అయితే.. ఈ ఆలయ నిర్మాణం ఇస్లాంకు వ్యతిరేకం అని ఇమ్రాన్‌ఖాన్ ప్రభుత్వ భాగస్వామి అయిన పాకిస్థాన్ ముస్లింలీగ్ ఖ్వైద్ అభ్యంతరం తెలిపింది.