కాబుల్‌లో తాజాగా జరిగిన రాకెట్ దాడులకు(Kabul rocket attack) తామే బాధ్యులమని ఇస్లామిక్ స్టేట్ తీవ్రవాదుల బృందం ప్రకటించుకుంది. కత్యుషా రకానికి చెందిన ఆరు రాకెట్లను ప్రయోగించినట్లు తెలిపింది. ఈ విషయాన్ని ఇస్లామిక్ స్టేట్(Islamic State) మీడియా విభాగం వెల్లడించింది.
ఇస్లామిక్ స్టేట్.. సోమవారం ఉదయం ప్రయోగించిన ఈ రాకెట్లను రక్షణ వ్యవస్థ ద్వారా అమెరికా సైన్యం అడ్డుకుంది. ఓ వాహనం వెనుక భాగం నుంచి మొత్తం ఐదు రాకెట్లు ప్రయోగించినట్లు తెలిపింది. ఈ రాకెట్లు ఎయిర్పోర్ట్ సమీపంలోని ఓ ప్రాంతంలో ల్యాండ్ అయ్యాయి. అయితే, ఈ దాడుల వల్ల పౌరుల తరలింపు ప్రక్రియకు ఆటంకం కలగలేదు.
అఫ్గాన్ నుంచి అమెరికా సైన్యం బయటకు వెళ్లిపోతునున్న నేపథ్యంలో కాబుల్‌లో వరుస దాడులు జరుగుతున్నాయి. గురువారం ఐసిస్-కే ఉగ్ర సంస్థ ఆత్మాహుతి దాడులకు తెగబడింది. ఈ ఘటనలో సుమారు 180 మంది మరణించారు. అందులో 13 మంది అమెరికా సైనికులు కూడా ఉన్నారు.
ఇదీ చదవండి: క్లైమాక్స్‌కు అమెరికా-అఫ్గాన్ కథ.. డెడ్‌లైన్‌కు 24 గంటలే!