సరిహద్దుల్లో వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ) వెంబడి, లద్దాఖ్‌లో నెలకొన్న సైనిక ప్రతిష్టంభన నేపథ్యంలో పరిష్కారం దిశగా భారత్, చైనా ముందడుగు వేశాయి. ఇందులో భాగంగా ఇరు దేశాల మధ్య త్వరలో 12వ విడత సైనికపరమైన చర్చలు జరిగే అవకాశాలున్నట్టు ఆర్మీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 26న చర్చలు జరపాలని తొలుత చైనా సూచించినట్లు పేర్కొన్నాయి. అయితే అదే రోజు కార్గిల్ విజయ్ దివస్ నేపథ్యంలో తమ బలగాలు వివిధ కార్యక్రమాల్లో నిమగ్నమై ఉంటాయని భారత్ స్పష్టంచేసింది. చర్చలకు మరో తేదీని ఖరారు చేయాల్సిందిగా సూచించింది.
తేల్చి చెప్పిన భారత్...
తూర్పు లద్దాఖ్‌లోని వివాదాస్పద దెప్‌సంగ్ మైదానాలు, గోగ్రా, హాట్ స్ప్రింగ్స్ ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గించే దిశగా ఇరు దేశాలూ చర్చలు జరపనున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. అయితే ఇరువైపులా సమాన సంఖ్యలో బలగాల ఉపసంహరణకు ఒప్పందం కుదిరితేనే అక్కడి నుంచి తమ సైన్యాన్ని వెనక్కి రప్పించేందుకు అంగీకరిస్తామని భారత్ తేల్చి చెప్పింది.
పరస్పరం అవగాహన..
ఈ అంశంపై విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బగ్చీ మాట్లాడారు. ఇటీవల చైనా విదేశాంగ మంత్రితో భారత విదేశీ వ్యవహారాల మంత్రి ఎస్. జైశంకర్ సమావేశమైనట్లు తెలిపారు. త్వరలోనే ఇరు దేశాల మధ్య సైనికపరమైన చర్చలు జరిపేందుకు ఆ సమావేశంలోనే ఇరువురు మంత్రులూ అంగీకారం తెలిపినట్లు వెల్లడించారు. చర్చల నేపథ్యంలో ఘర్షణలు పెంచే విధంగా ఎవరూ వ్యవహరించకూడదని పరస్పరం అవగాహన కుదుర్చుకున్నట్లు తెలిపారు.
ఇదీ చూడండి: చైనా సరిహద్దుల్లో మరో 50 వేల సైనికులు
ఇదీ చూడండి: బలగాల ఉపసంహరణకు చైనా సాకులు!