ప్రపంచంలోనే అధిక జనాభా గల దేశంగా పేరు పొందిన చైనాలో ప్రస్తుతం యువత సంఖ్య తగ్గి, వృద్ధుల సంఖ్య పెరిగి.. 'జనాభా సంక్షోభాన్ని'(China population crisis) ఎదుర్కొంటోంది. చైనాలో తక్కువ మంది పెళ్లిళ్లు చేసుకోవడం, శిశు జననాల రేటు తగ్గడమే ఈ సంక్షోభానికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
చైనాలో వరుసగా ఏడేళ్లపాటు వివాహ రిజిస్ట్రేషన్ల సంఖ్య భారీగా తగ్గిపోతూ వస్తోంది. గతేడాదిలో ఈ సంఖ్య 17 ఏళ్ల కనిష్ఠానికి తాకింది. ఈ మేరకు 'చైనా స్టాటిస్టికల్ ఇయర్‌బుక్-2021' గణాంకాలు(China statistical yearbook 2021) చెబుతున్నాయి. ఈ ఇయర్ బుక్‌ను(China demographics) ఆ దేశ పౌర వ్యవహారాల శాఖ విడుదల(China population latest news) చేసింది.
నివేదికలో ఏముంది?
- 2021 తొలి త్రైమాసికంలో 58.7లక్షల జంటలు వివాహం చేసుకున్నాయి. గతేడాది ఇదే త్రైమాసికంతో పోల్చితే ఈ సంఖ్య తక్కువగా ఉండటం గమనార్హం.
- 2021 ఏడాది మొత్తంలో కూడా వివాహాల రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గుదల కొనసాగుతుందని నివేదిక అంచనా వేసింది.
- జననాల రేటు కూడా చైనాలో తగ్గుతోందని నివేదిక తెలిపింది. చైనాలో గతేడాది జననాల రేటు 0.852గా ఉంది. 1978 తర్వాత ఒక శాతం కంటే తక్కువకు జననాల రేటు చేరుకోవడం ఇదే తొలిసారి.
వృద్ధుల సంఖ్య పెరుగుదలతో జనాభా(china population) సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న నేపథ్యంలో 2016లో చైనా కీలక నిర్ణయం తీసుకుంది. అంతకుమందు అమల్లోకి తెచ్చిన 'ఏక సంతాన' నిబంధనను రద్దు చేసి.. దంపతులు ఇద్దరు పిల్లల్ని కనేందుకు అనుమతించింది. అయినా జనాభా సంక్షోభంలో సరైన మార్పులు రాని కారణంగా.. ఈ ఏడాది ప్రారంభంలో ముగ్గురు పిల్లలను కనేందుకు(China three child policy ) అనుమతినిచ్చింది.
పెళ్లిళ్లు చేసుకోకపోవడానికి కారణాలేంటి?
చైనాలో వివాహాల సంఖ్య తగ్గడానికి ప్రధాన కారణం.. ఆ దేశంలోని యువత సంఖ్య తగ్గడమేనని 'డెమోగ్రఫిక్ నిపుణుడు హీ యాఫు తెలిపారు. చైనా జాతీయ గణాంకాల ప్రకారం.. జనాభా క్రమంగా తగ్గుతూ వస్తోందని ఆయన పేర్కొన్నారు.
"అధిక పని ఒత్తిడి, మహిళల విద్యా స్థాయులు పెరగడం, ఆర్థిక స్వాతంత్ర్యం తదితర కారణాల వల్ల పెళ్లి చేసుకునే యువత సంఖ్య తగ్గుతోంది. పురుషులు, మహిళ జనాభా నిష్పత్తిలో అసమతుల్యత ఉండడం కూడా ఈ సంఖ్య తగ్గడానికి మరో ప్రధాన కారణం. జీవన వ్యయం అధికంగా ఉండటం, నిరుద్యోగం తదితర కారణాల వల్ల యువత పెళ్లి చేసుకుని, పిల్లలను కనేందుకు పెద్దగా ఆసక్తి చూపడం లేదు."
-హీ యాఫు, జనాభా నిపుణుడు
చైనాలో వివాహాలకు, శిశుజననాలకు సన్నిహిత సంబంధం ఉంటుందని హీ యాఫు పేర్కొన్నారు. వివాహేతర సంబంధాల వల్ల పుట్టే పిల్లల సంఖ్య కూడా చైనాలో తక్కువగా ఉందని చెప్పారు. వివాహాల రిజిస్ట్రేషన్ల సంఖ్య తగ్గడం వల్ల జననాల రేటుపై ప్రతికూల ప్రభావం పడుతుందని వెల్లడించారు. ఈ పరిస్థితిని నివారించడానికి స్థానిక ప్రభుత్వాలు తగిన చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు.
చైనాలో 60 లేదా అంతకంటే ఎక్కువ వయసు ఉన్నవారి జనాభా(China old population) ప్రస్తుతం 26.4కోట్లుగా ఉంది. ఇది ఆ దేశ మొత్తం జనాభాలో 18.7శాతంతో సమానం. తాజా జనాభా లెక్కల ప్రకారం.. 21 ఏళ్లుగా చైనాలో సగటు వార్షిక వృద్ధుల జనాభా పెరుగుదల రేటు దాదాపు 63 లక్షలుగా ఉంది. 2023 నుంచి ఈ సంఖ్య ఏడాదికి కోటి మంది చొప్పున మారనుందని చైనా డైలీ రిపోర్ట్ అంచనా వేసింది. 2036 నాటికి చైనాలో వృద్ధుల జనాభా 29.1శాతానికి చేరుతుందని చెప్పింది.
ఇవీ చూడండి: