చైనాలో అంతకంతకూ విస్తరిస్తోన్న కరోనా వైరస్(కొవిడ్-19) ధాటికి ఆరుగురు వైద్యసిబ్బంది బలయ్యారు. మరో 1,700 మందికి పైగా ఈ మహమ్మారి బారినపడ్డారు. సరైన రక్షణ పరికరాలు అందుబాటులో లేనందునే ఈ పరిస్థితి నెలకొందని వైద్యాధికారులు తెలిపారు.
ఇప్పటివరకు కరోనా వైరస్ సోకిన వైద్య సిబ్బంది సంఖ్య 1,716 కు చేరిందని చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ఉపాధ్యక్షుడు జెంగ్ యిక్సిన్ తెలిపారు. అందులో వుహాన్లోనే 1,102 మంది ఉన్నారని ఆయన స్పష్టం చేశారు. హుబే రాష్ట్రంలోని ఇతర ప్రదేశాలలో మరో 400 మంది ఈ వ్యాధి బారినపడ్డారని చెప్పారు జెంగ్.
కరోనాను అందరికన్నా ముందే గుర్తించిన వైద్యుడు లీ వెన్లియాంగ్ అదే వైరస్ సోకి ఈనెల 7న మరణించారు. లీ మరణం తర్వాత చైనాపై తీవ్రస్థాయిలో విమర్శలు వచ్చాయి. వైద్య సిబ్బంది ఆరోగ్య పరిస్థితిపై వాస్తవాలు చెప్పడంలేదని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో తాజా గణాంకాలు వెల్లడించింది అక్కడి ప్రభుత్వం.
16 మంది వైద్యులకు..?
కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్న నేపథ్యంలో చైనాలో వైద్య సిబ్బందిపై తీవ్ర ఒత్తిడి నెలకొంది. మాస్కులు, సరైన రక్షణ పరికరాలు లేకుండా వారు గంటల తరబడి నిర్విరామంగా విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. ఫలితంగా వారు కూడా అనారోగ్యం పాలవుతున్నారు.
తనతో పాటు మరో 16 మంది సహచరులకు కరోనా సోకినట్లు అనుమానంగా ఉందని వుహాన్లో ఓ వైద్యుడు తెలిపారు.
ఇదీ చదవండి: కరోనా మృత్యుఘోష: 1500లకు చేరువలో మృతుల సంఖ్య