వాతావరణ మార్పుల కట్టడి కోసం గ్లాస్గో వేదికగా జరిగిన కాప్26 ప్రపంచ నేతల సదస్సుకు(Cop26 World Leaders Summit) చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్(Cop26 China Not Attending) డుమ్మాకొట్టారు. జిన్‌పింగ్ వర్చువల్‌గా ఈ సమావేశానికి హాజరు అవుతారని అంతా భావించినప్పటికీ.. ఆయన గైర్హాజరయ్యారు. దాంతో కర్బన ఉద్గారాల తగ్గింపు విషయంలో చైనా తన వైఖరిని మార్చుకోనుందా? అనే ప్రశ్నలు తలెత్తాయి. అయితే.. దీనిపై చైనా తాజాగా స్పందించింది. కాప్26 సదస్సు(Cop26 Summit 2021) నిర్వాహకులు తమకు వీడియోకాల్ లింక్ పంపించలేదని ఆరోపించింది. అందుకే జిన్‌పింగ్ ఈ సదస్సుకు హాజరు కాలేదని చెప్పింది.
లిఖితపూర్వక ప్రకటన..
వాతావరణ మార్పులపై తమ నిర్ణయాలను వివరిస్తూ కాప్26కు జిన్‌పింగ్(Cop26 China Delegation) ఓ లిఖితపూర్వక ప్రకటనను పంపారు. వాతావరణ మార్పులను ఎదుర్కోవడానికి అన్ని దేశాలు సమష్టిగా పోరాడాలని ఆ ప్రకటనలో జిన్‌పింగ్ పేర్కొన్నారు. అయితే.. వీడియో కాన్ఫరెన్సు ద్వారా జిన్‌పింగ్ హాజరవకుండా ఈ లేఖను ఎందుకు పంపారని బీజింగ్‌లో ఆ దేశ విదేశాంగ శాఖ ప్రతినిధి వాంగ్ వెన్‌బిన్‌ను విలేకరులు ప్రశ్నించారు. "నాకు తెలిసిన విషయం ఏంటంటే.. కాప్26 సదస్సు నిర్వాహకులు వీడియో లింక్‌ను పంపలేదు. అందుకే జిన్‌పింగ్ హాజరుకాలేదు" అని ఆయన సమాధానమిచ్చారు.
అప్పటి నుంచి వర్చువల్‌గానే..
కరోనా నేపథ్యంలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్.. విదేశీ ప్రయాణాలను మానుకున్నారు. గతేడాది జనవరి మధ్యలో మయన్మార్‌లో ఆయన చివరిసారి పర్యటించారు. అప్పటి నుంచి అనేక అంతర్జాతీయ సమావేశాలకు జిన్‌పింగ్ వీడియోకాల్ ద్వారా మాత్రమే హజరవుతున్నారు. అక్టోబరు 30న రోమ్‌లో జరిగిన జీ20 దేశాల శిఖరాగ్ర సదస్సులోనూ ఆయన వర్చువల్‌గానే పాల్గొన్నారు.
కర్బన ఉద్గారాలను అత్యధికంగా వెలువరించే దేశాల్లో ఒకటైన చైనా నుంచి కాప్26 సదస్సుకు ఆ దేశ ప్రతినిధి హజరుకాకపోవడం(Cop26 China Not Attending) వల్ల వాతావరణ మార్పుల కట్టడిలో ఆ దేశ నిబద్ధతపై సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే.. కాప్26 సదస్సు ప్రారంభమవటానికి ముందే గత గురువారం వాతావరణ మార్పుల కట్టడికి దేశీయంగా నిర్దేశించుకున్న లక్ష్యాలను(ఎన్డీసీ)లను ఐక్యరాజ్య సమితికి చైనా సమర్పించింది. అందులో 2030 కంటే ముందునాటికి చైనాలో ఉద్గారాలు గరిష్ఠ స్థాయికి చేరుతాయని.. 2060 నాటికి నెట్ జీరో స్థాయికి పరిమితం చేస్తుందని పేర్కొంది. అయితే.. పర్యావరణ కార్యకర్తలు చైనా ఎన్డీసీని అసంపూర్ణమైనదిగా విమర్శించారు. వాతావరణ మార్పుల కట్టడిలో చైనా తన లక్ష్యాలను నెరవేర్చడంలో విఫలమైందని ధ్వజమెత్తారు.
'అది పెద్ద పొరపాటే'
జిన్‌పింగ్‌తో పాటు, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా కాప్26 సదస్సుకు గైర్హాజరయ్యారు. ఈ నేపథ్యంలో.. ఈ సదస్సుకు హాజరు కాకుండా చైనా, రష్యా పెద్ద పొరపాటు చేశాయని తాను భావిస్తున్నానని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు.
ఇవీ చూడండి: