ఆస్ట్రేలియాలో కార్చిచ్చు జ్వాలలు ఎగసిపడుతూనే ఉన్నాయి. భారీ అగ్ని ప్రళయం సృష్టిస్తోన్న నష్టం అంతాఇంతా కాదు. ఇప్పటికే లక్షల ఎకరాలను కాల్చి బూడిద చేసిన మంటలు.. 24 మంది ప్రాణాలను బలిగొన్నాయి. కంగారూ ద్వీపంలో వేలాది వన్యప్రాణులు మంటల్లో మాడిపోతున్నాయి.
కంగారూ.. కోలాకు గండం
![fire](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5598559_rk.jpg)
ఆస్ట్రేలియా అనగానే కంగారూలు, కోలాలు గుర్తుకురానివారు ఉండరు.. కడుపు సంచిలో బిడ్డను మోస్తూ కంగారూ.. అమయాకమైన వదనాలతో కోలాలు ఆస్ట్రేలియాకే ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. వాటిని చూసేందుకు ఏటా లక్షలాది మంది పర్యటకులు ఆస్ట్రేలియా ద్వీపానికి వస్తారు.
ఈ అందమైన పర్యటక ప్రాంతం ఇప్పుడు వెలవెలబోతోంది. కంగారూ ద్వీపంలోని ఒక లక్షా 70 వేల హెక్టార్ల భూభాగం నిప్పుల్లో మాడి మసైపోయింది. మంటల ధాటికి 50 వేలకు పైగా సంచరించే... అరుదైన కోలా జంతువుల సంఖ్య సగానికి పడిపోయింది. క్లామిడియా వ్యాధితో బాధపడే ఈ కోలా సమూహం మనుగడకు ఈ ద్వీపమే అనుకూలమైందని అడిలైడ్ విశ్వవిద్యాలయ అధ్యయనం తెలిపింది.
అంతే కాదు.. 3000 గొర్రెలు, వందలాది చెట్లతో పాటు ఆర్కిడ్ మొక్కలు మంటల్లో కాలిపోయాయి. అనేక జంతువులు మృత్యువాత పడ్డాయి. పశువైద్యులు గాయపడిన జంతువులను ఘటనా స్థలంలోనే రక్షించి చికిత్స చేస్తున్నారు.
![Australia's 'insurance' koala population halved by bushfires; Australia bushfire crisis: PM sets up national bushfire recovery agency, toll climbs to 24](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/5598559_45_5598559_1578218420529.png)
ప్రభుత్వ చర్యలు..
ఈ విపత్తు నుంచి బయటపడేందుకు ఆ దేశ ప్రధాన మంత్రి స్కాట్ మోరిసన్ 'జాతీయ బుష్ఫైర్ రికవరీ ఏజెన్సీ'ని స్థాపించారు. దగ్ధమైన వంతెనలు, రోడ్లు, భవనాలను పునఃనిర్మించేందుకు తొలిసారిగా 3000 ప్రత్యేక రక్షక బలగాలను మొహరించారు. దట్టమైన పొగలతో పాడైపోతున్న వేలాది మంది ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకునేందకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
ప్రజలకు హెచ్చరికలు..
యావత్ దేశాన్ని ఉడికిస్తోన్న అగ్ని జ్వాలలు ఇంకా చల్లారడంలేదు.. కార్చిచ్చు కారణంగా ఇప్పటికే 2 వేలకు పైగా ఇళ్లు దగ్ధమయ్యాయి. వేలాది మంది శరణార్థులు న్యూ సౌత్ వేల్స్లో ఆశ్రయం పొందుతున్నారు.
ఇప్పుడు ఆ దేశ రాజధాని సిడ్నీ సహా.. న్యూ సౌత్ వేల్స్, విక్టోరియా, దక్షిణాస్ట్రేలియా, క్వీన్స్ ల్యాండ్ ప్రాంతాల్లో మంటలు మరింత విజృంభిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈడెన్, అడిలైడ్, ప్రాంతాలను ప్రజలు తక్షణమే విడిచి సురక్షిత ప్రాంతాలకు చేరుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు. దీంతో చేసేదేమీ లేక ప్రాణాలు అరచేత పట్టుకుని బయల్దేరారు స్థానికులు.
వారి సాహసానికి సాహో!
ప్రాణాలకు తెగించి అగ్ని జ్వాలలను అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు రక్షణ సిబ్బంది. మంటలనార్పేందుకు వెళ్లిన ముగ్గురు సైనికులు మృతి చెందారు. ఆ దేశ ప్రధాని అదనపు బలగాలను మోహరించారు.
తగ్గేదెలా..
ఇప్పటికే ఆస్ట్రేలియా వ్యాప్తంగా 150 చోట్ల కార్చిచ్చు రాజుకుంది. సుమారు 9 లక్షల 23 వేల హెక్టార్లు మంటలకు ఆహుతయ్యాయి. అందులో 64 కార్చిచ్చులు నియంత్రించలేని విధంగా ఎగసిపడుతున్నాయి. ఈ మంటలను ఆర్పేందుకు సమారు 200 మి.మీ వర్షపాతం కురవాల్సి ఉంటుంది.
ప్రధాని పర్యటన రద్దు..
కార్చిచ్చు కారణంగా.. ఈ నెల 13న ఖరారైన భారత పర్యటనను రద్దు చేసుకున్నారు ఆస్ట్రేలియా ప్రధాని మోరిసన్ .
ఇదీ చదవండి:'వీర శునకం' అంత్యక్రియల్లో పోలీసుల కంటతడి