ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కొత్తరకం కరోనా వైరస్‌కు టీకాను అభివృద్ధి చేసే దిశగా ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు కీలక ముందడుగు వేశారు. వీరికి భారత సంతతి శాస్త్రవేత్త ఎస్.ఎస్.వాసన్ నాయకత్వం వహిస్తున్నారు. వీరు ప్రయోగశాలలో తొలి బ్యాచ్ కరోనా వైరస్‌ను విజయవంతంగా వృద్ధి చేశారు.
వాసన్ బృందం మరింత ముందుకు...
ఆస్ట్రేలియాలోని అత్యంత భద్రమైన ‘కామన్వెల్త్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్’ (సీఎస్ఐఆర్వో) ఆధ్వర్యంలో ఈ పరిశోధనలు సాగుతున్నాయి. మెల్బోర్న్లోని డోహెర్తీ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు ఇప్పటికే మానవ నమూనా నుంచి కరోనా వైరస్‌ను విజయవంతంగా వేరు చేయగలిగారు. దీన్ని వాసన్ బృందం మరింత ముందుకు తీసుకెళ్లి, ప్రయోగశాలలో ఈ వైరస్ సంఖ్యను వృద్ధి చేసింది. సదరు సూక్ష్మజీవికి సంబంధించిన లక్షణాలను నిర్ధరించడానికి ఇది వీలు కల్పిస్తుంది.
టీకా అభివృద్ధిలో కీలకం!
కొత్త టీకా అభివృద్ధిలో ఇది కీలకం. ''కరోనా వైరస్ వృద్ధికి, పునరుత్పత్తికి ఎంత కాలం పడుతోంది? మానవ శ్వాసకోశ వ్యవస్థపై ఎలా ప్రభావం చూపుతుంది? ఇతరులకు ఎలా సంక్రమిస్తుంది.. వంటి వివరాలను తెలుసుకోవడం మా ఉద్దేశం'' అని సీఎస్ఐఆర్ఓ పేర్కొంది. కరోనా వైరస్ టీకాను 16 వారాల్లో మానవులపై పరీక్షించాలని ఈ సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది.
వాసన్.. పిలానీలోని ‘బిట్స్’లో, బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్‌లో చదివారు. గతంలో ఆయన డెంగీ, జికా, గన్యా వ్యాధులపైనా పరిశోధనలు సాగించారు.
ఇదీ చదవండి: హాంకాంగ్ నౌకలోని ప్రయాణికులకు విముక్తి