ప్రపంచ ఆరోగ్య సంస్థ, భారత్ కలిసి సమన్వయంతో పోలియో నివారణకు చేసిన కృషిని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ చీఫ్ టెడ్రోస్ అధనామ్ కొనియాడారు. ఇలాంటి ప్రయత్నాలు కొవిడ్-19 వంటి వ్యాధులపై విజయం సాధించడానికి దోహదపడతాయని పేర్కొన్నారు.
పోలియోను జయించడానికి రూపొందించిన వ్యూహాల ద్వారా కరోనా మహమ్మారిపై పోరాడేందుకు భారత్‌తో కలిసి పనిచేస్తామన్నారు టెడ్రోస్. పోలియో నివారణకు ఏర్పాటు చేసిన యంత్రాంగం... కొవిడ్-19 పర్యవేక్షణలో పాల్గొంటుందని వెల్లడించారు. ట్యూబర్క్యులోసిస్ సహా ఇతర వ్యాధులను నివారించడానికి క్షేత్ర స్థాయి సిబ్బంది సహకారం అందిస్తారని స్పష్టం చేశారు.
వైద్య శాఖకు ప్రశంస
ఈ మేరకు భారత వైద్య శాఖను టెడ్రోస్ ప్రశంసించారు. నాయకత్వ సహకారం అందించినందుకు కేంద్ర మంత్రి హర్షవర్ధన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ప్రయత్నాలు సంయుక్తంగా కరోనా వైరస్‌ను జయించేందుకు తోడ్పడతాయని పేర్కొన్నారు.
"పోలియోని జయించడంలో ఉపయోగపడిన అత్యుత్తమ పద్ధతులు, వనరులతో కొవిడ్-19ను ఎదుర్కొనేందుకు భారత్, డబ్ల్యూహెచ్ఓ ఆగ్నేయ విభాగం కలిసి డబ్ల్యూహెచ్ఓ జాతీయ నిఘా యంత్రాంగం ద్వారా సహకారం అందించుకుంటున్నాయి. ఇది గొప్ప విషయం." -టెడ్రోస్ అధనామ్, డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్
భారత ప్రభుత్వం, డబ్ల్యూహెచ్ఓ కలిసి ప్రపంచానికి తమ సామర్థ్యాన్ని ప్రదర్శించాయని ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్ధన్ పేర్కొన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ తన ప్రకటనలో పేర్కొంది. చిత్త శుద్ధి, అంకితభావంతో సంయుక్తంగా చేసిన ప్రయత్నాల ద్వారా పోలియోను నివారించినట్లు మంత్రి వెల్లడించారని తెలిపింది.
క్షేత్ర స్థాయిలో ఉన్న ఐడీఎస్పీ, రాష్ట్ర విపత్తు స్పందన దళాలతో పాటు డబ్ల్యూహెచ్ఓను కరోనా నిఘా యోధులుగా హర్షవర్ధన్ అభివర్ణించినట్లు డబ్ల్యూహెచ్ఓ పేర్కొంది.
ఇదీ చదవండి: 'పరీక్షల సంఖ్య పెరిగితేనే కరోనా కట్టడి సాధ్యం'