కరోనా వైరస్ పుట్టుకపై నిజానిజాలు తేల్చేందుకు మరో బృందాన్ని ఏర్పాటు చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. వేర్వేరు విభాగాలకు చెందిన 26 మంది నిపుణులతో కూడిన ఈ జట్టు.. కరోనా సహా అలాంటి వైరస్ల మూలాలు తెలుసుకునేందుకు అనుసరించాల్సిన విధివిధానాలు రూపొందించడంపై డబ్ల్యూహెచ్ఓకు సలహాలు ఇవ్వనుంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ అధినేత టెడ్రోస్ అధనోమ్ జెనీవాలో ఈ విషయం వెల్లడించారు.
"మహమ్మారిగా మారే వైరస్లు మున్ముందు కూడా ఉద్బవిస్తాయన్నది వాస్తవం. ఇప్పుడు వచ్చిన కరోనా అలాంటిదే. అదే చివరిది కాదు. అలాంటి వైరస్ల మూలాలను గుర్తించడంపై అంతర్జాతీయ స్థాయిలో విధివిధానాల రూపకల్పనపై డబ్ల్యూహెచ్ఓకు నిపుణుల బృందం సలహాలు ఇస్తుంది." అని తెలిపారు టెడ్రోస్.
26 మందితో కొత్త బృందం...
కరోనా మూలాల అధ్యయనంలో భాగమయ్యేందుకు ముందుకు రావాలని డబ్ల్యూహెచ్ఓ నిపుణులను ఆహ్వానించగా... మొత్తం 700 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో 26 మందిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎంపిక చేసింది. వీరంతా.. ఎపిడమాలజీ, జంతువుల ఆరోగ్యం, క్లినికల్ మెడిసిన్, వైరాలజీ, జినోమిక్స్ వంటి రంగాల్లో నిష్ణాతులు.
అయితే... ఈ నిపుణుల బృందం చైనాకు నేరుగా వెళ్లి పరిశోధనలు చేపట్టదని స్పష్టం చేశారు డబ్ల్యూహెచ్ఓ సాంకేతిక విభాగం సారథి డాక్టర్ మరియా వాన్ కెర్ఖోవే. కరోనా మూలాలు తెలుసుకునేందుకు చైనా సహా మరే ఇతర దేశంలోనైనా పరిశోధనలు జరపాలా అనే అంశంపై డబ్ల్యూహెచ్ఓకు సలహాలు మాత్రమే ఇస్తుందని తెలిపారు.
ఓసారి విఫలయత్నం..
వుహాన్ ల్యాబ్‌లోనే కరోనా పుట్టిందన్న ఆరోపణల మధ్య ఈ ఏడాది ఆరంభంలో డబ్ల్యూహెచ్ఓ ఏర్పాటు చేసిన శాస్త్రవేత్తల బృందం చైనాకు వెళ్లింది. అయితే.. కరోనా వైరస్ వెలుగులోకి రావడానికి ముందు చైనా ఎలాంటి పరిశోధనలు జరిపిందో నిర్ధరించడంలో విఫలమైంది. శాస్త్రవేత్తల బృందానికి చైనా సరిగా సహకరించకపోవడం కూడా ఇందుకు ఓ కారణం.
'సహకరిస్తాం.. కానీ..'
కరోనా మూలాల అన్వేషణపై చేపట్టిన తాజా అధ్యయనానికి సహకరిస్తామని చైనా వెల్లడించింది. అయితే రాజకీయ ఒత్తిడితో డేటా తారుమారు అయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించింది.
"కరోనా మూలలను కనుగొనేందుకు జరిగే ఎలాంటి శాస్త్రీయ ప్రక్రియకైనా మేము సహకరిస్తాము. అదే సమయంలో రాజకీయ ఒత్తిడితో పరిస్థితులను తారుమారే చేసే ప్రయత్నం జరిగితే మాత్రం దానిని తీవ్రంగా వ్యతిరేకిస్తాం. డబ్ల్యూహెచ్ఓ సెక్రటరీ, సలహాదారు బృందం.. శాస్త్రీయంగా దర్యాప్తు చేస్తుందని ఆశిస్తున్నాము."
--- జావో లిజియాన్, చైనా విదేశాంగశాఖ ప్రతినిధి.
ఇదీ చూడండి:-