సినిమాలో క్లైమాక్స్ బాగుంటే.. ఆ చిత్రం సూపర్‌హిట్ అయ్యేందుకు ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈ సూత్రం సినిమాలకే కాదు రాజకీయాలకూ వర్తిస్తుంది. నేతలు ఐదేళ్లు సుపరిపాలన అందించినప్పటికీ ఎన్నికల సమయంలో చేసే ప్రచారాలే ఓటర్లను ఆకర్షించి తుది ఫలితాలను నిర్దేశిస్తాయి. అయితే ప్రస్తుతం కరోనా దెబ్బతో ప్రపంచ రాజకీయాల స్థితిగతులు మారే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి.
అమెరికా అధ్యక్ష ఎన్నికలు ఈ ఏడాదిలోనే జరగాల్సి ఉంది. ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో పాటు ఆయన ప్రత్యర్థి పార్టీ నేతలైన డెమొక్రాట్లకు కూడా ఓటర్లను ఆకర్షించేందుకు ఇదే అత్యంత కీలక సమయం. అయితే కరోనా దెబ్బతో అటు రిపబ్లికన్, ఇటు డెమొక్రటిక్ పార్టీ నేతలు ప్రచారాలను వాయిదా వేయక తప్పలేదు.
ఇటు ట్రంపే.. మరి అటు?
ప్రధాన పార్టీల అధ్యక్ష అభ్యర్థిని ఎన్నుకునేందుకు అన్ని రాష్ట్రాల్లోనూ జరిగే కాకసస్(పార్టీ ప్రాథమిక ఎన్నికల)పైనా కరోనా ప్రభావం పడింది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఈ ప్రక్రియ పూర్తికాగా.. మరికొన్ని రాష్ట్రాల్లో వాయిదా పడింది. ఫలితంగా డెమొక్రటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్థిగా పోటీకి దిగేదెవరో తేలేందుకు మరింత సమయం పట్టనుంది. ఇప్పటివరకు జరిగిన కాకసస్లో డెమొక్రటిక్ పార్టీ తరఫున జో బిడెన్, బెర్నీ శాండర్స్ ముందంజలో ఉన్నారు. రిపబ్లికన్ పార్టీ తరఫున ట్రంప్ మరోమారు అధ్యక్ష బరిలో నిలవడం ఖాయంగా కనిపిస్తోంది.
ప్రచారాలే కీలకం.. కానీ..!
ఎన్నికల సమయంలో నేతలు ప్రజలను తమ వైపు తిప్పుకోవడానికి సరైన మార్గాలు ప్రచారాలే. ట్రంప్‌కు అత్యంత శక్తిమంతమైన రాజకీయ ఆయుధాలు కూడా ఎన్నికల ర్యాలీలే. గత అధ్యక్ష ఎన్నికల్లోనూ 'అమెరికానే ప్రథమం' అని నినదిస్తూ.. హిల్లరీ క్లింటన్‌పై అనూహ్య విజయం సాధించారు ట్రంప్. అందుకే ప్రచారాల్లో తనదైన శైలిలో డెమొక్రాట్లపై విరుచుకుపడి ఓటర్లను ఆకర్షించడంలో ట్రంప్ దిట్ట.
మరోవైపు అరిజోనా, ఫ్లోరిడా, ఇల్లినాయీ, ఒహాయో రాష్ట్రాల్లో కాకసస్ ఎన్నికలు జరుగుతున్నాయి. జో బిడెన్, బెర్నీ శాండర్స్‌లు ఆన్లైన్లోనే చర్చల్లో పాల్గొన్నారు. సాధారణంగా ప్రజల మధ్య సాగాల్సిన ఈ డిబేట్లు ఎలాంటి కోలాహలం లేకుండానే ముగిశాయి. అయితే మొత్తం 50 రాష్ట్రాల్లో జరిగే పార్టీ ప్రాథమిక ఎన్నికల్లో ఎవరు గెలిచి.. అధ్యక్ష అభ్యర్థిగా ఎన్నికైనా.. ట్రంప్‌పై జరిగే తుదిపోరులో నివాలంటే మాత్రం ర్యాలీలు అత్యంత కీలకం. కానీ కరోనా ప్రభావంతో ర్యాలీలు వాయిదా పడ్డ నేపథ్యంలో.. ట్రంప్‌పై ప్రజల్లో వ్యతిరేకతను తేవడంలో వీరు ఏ మేరకు విజయం సాధిస్తారన్నది ప్రశ్నార్థకమే.
మరోవైపు కరోనా ప్రభావంతో కెంటక్కీ, జార్జియా, లూసియానా తదితర రాష్ట్రాల్లో కాకసస్ ఎన్నికలు వాయిదా పడ్డాయి.
మనసు మార్చుకున్న ట్రంప్
మొదట్లో కరోనా వైరస్ వ్యాప్తి ఉన్నప్పటికీ ఎన్నికల ప్రచారాలను ఆపేది లేదన్న ట్రంప్.. తర్వాత మనసు మార్చుకున్నారు. ట్రంప్‌తో పాటు ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్ హాజరైన 'ద కన్జర్వేటివ్ పొలిటికల్ యాక్షన్ కాన్ఫరెన్స్ (సీపీఏసీ)' సభలో పాల్గొన్న ఓ వ్యక్తికి కరోనా సోకినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ నేపథ్యంలో కొద్దిరోజుల పాటు ప్రచారానికి విరామం పలికారు ట్రంప్. నియంత్రణ చర్యల్లో భాగంగా ఐరోపా సమాఖ్య దేశాలతో పాటు చైనాకు రాకపోకలపై ఆంక్షలు విధించారు.
ఈ ఏడాదే ఎన్నికలు!
అమెరికాలో మొత్తం 50 రాష్ట్రాల్లోనూ ఈ ఏడాది నవంబరు 3న అధ్యక్ష ఎన్నికలు జరగాల్సి ఉంది.
ఇదీ చూడండి : 'నేను చెప్పేది ఎవరూ పట్టించుకోరు ఎందుకు?'