Sick leaves for domestic workers: ఆయాలు, గార్డెనర్లతో పాటు ఇళ్లలో పనిచేసే కార్మికులకు వేతనంతో కూడిన అనారోగ్య సెలవులు(పెయిడ్ సిక్ లీవ్) తప్పక ఇవ్వాలని అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నిబంధన తీసుకొచ్చింది. ఇందుకు సంబంధించిన చట్టాన్ని నగరానికి చెందిన సూపర్వైజర్ల బోర్డు మంగళవారం ఏకగ్రీవంగా ఆమోదించింది. శాన్ఫ్రాన్సిస్కోలో పనిచేసే 10 వేల మందికి ఇది ప్రయోజనం చేకూర్చనుంది.
San Francisco Sick leaves
ఇళ్లలో క్లీనింగ్, గార్డెనింగ్, వంట పని సహా పిల్లల్ని చూసుకోవడం వంటి పనులు చేస్తున్న వారికి తక్కువ వేతనం అందుతోందని, వీరికి సహాయం చేయాల్సిన బాధ్యత తమపై ఉందని అధికారి మిర్నా మెల్గార్ పేర్కొన్నారు. ప్రతి 30 గంటల పనికి ఒక గంట వేతనాన్ని సిక్ లీవ్ ఫండ్‌కు యజమానులు చెల్లిస్తారని చెప్పారు.
"ఒకటికన్నా ఎక్కువ ఇళ్లలో కార్మికులు పనిచేసే అవకాశం ఉన్న నేపథ్యంలో తాజా చట్టంలో ఓ నిబంధన జోడించాం. వారు పని చేసిన గంటల ఆధారంగా వారికి సిక్ లీవ్‌లు లభిస్తాయి. 30 గంటల పనికి ఒక గంట సిక్ లీవ్ అందుతుంది. ఇలా వచ్చిన వాటిని ఏకం చేసి.. వారు ఒకేసారి ఈ సెలవులు తీసుకోవచ్చు."
-అధికారులు
ఈ చట్టం అమలులోకి రావాలంటే మరోసారి జరిగే ఓటింగ్‌లో సూపర్వైజర్ల ఆమోదం పొందాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనిపై మేయర్ సంతకం చేయాలి. ఈ ప్రక్రియ పూర్తై.. నిబంధనలు అమలయ్యేందుకు కొన్ని నెలలు పడుతుందని అధికారులు చెబుతున్నారు.
ఇదీ చదవండి: 'ఒమిక్రాన్ వ్యాప్తి 70రెట్లు ఎక్కువ.. కానీ ఆ విషయంలో మాత్రం వీక్!'