భారత్‌లో వేల ఏళ్లుగా ప్రజాస్వామ్య పరంపర కొనసాగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (PM Modi) పేర్కొన్నారు. ఐరాస జనరల్ అసెంబ్లీలో (PM Modi at UNGA)ప్రసంగించిన ఆయన.. భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు కావొస్తోందని గుర్తు చేశారు. భారత్‌లో ఉన్న వైవిధ్యమైన పరిస్థితులే ఇక్కడి బలమైన ప్రజాస్వామ్యానికి గుర్తింపు అని అన్నారు. (Modi UNGA 2021)
"ప్రజాస్వామ్యానికి తల్లిగా భావించే దేశానికి నేను ప్రాతినిధ్యం వహిస్తున్నా. భారత్‌కు వెయ్యేళ్లుగా ప్రజాస్వామ్యమే గొప్ప సంప్రదాయం. శక్తిమంతమైన ప్రజాస్వామ్యానికి భారత్ గొప్ప ఉదాహరణ. వైవిధ్యంతోనే మా ప్రజాస్వామ్యానికి గుర్తింపు.
తండ్రితో కలిసి రైల్వే స్టేషన్లో టీ అమ్మిన ఓ బాలుడు(తన గురించి మాట్లాడుతూ) ఇప్పుడు ఐరాసలో ప్రసంగిస్తున్నాడు. ప్రధాని హోదాలో నాలుగో సారి ప్రసంగం ఇస్తున్నాడు. దీన్నిబట్టి ప్రజాస్వామ్యం ఎంత బలమైనదో అర్థం చేసుకోవచ్చు."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
గడిచిన ఏడాదిన్నర కాలంలో ప్రపంచమంతా తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొందని మోదీ (PM Modi) గుర్తు చేశారు. వందేళ్లలో లేని మహమ్మారిని చవిచూసిందని అన్నారు. ప్రమాదకరమైన వైరస్‌కు బలైనవారికి నివాళులు అర్పిస్తున్నట్లు ప్రకటించారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. (Modi UNGA 2021)
టీకా భారతీయం!
ప్రపంచంలోనే తొలి డీఎన్ఏ వ్యాక్సిన్‌ను భారత్ అభివృద్ధి చేసిందని మోదీ (Modi UNGA 2021) గుర్తు చేశారు. పన్నెండేళ్లు పైబడిన వారందరికీ ఈ టీకాను ఇవ్వవచ్చని తెలిపారు. ఎంఆర్ఎన్ఏ టీకా అభివృద్ధి తుది దశలో ఉందని తెలిపారు. కొవిడ్‌కు వ్యతిరేకంగా నాసల్ టీకాను సైతం భారత శాస్త్రవేత్తలు తయారు చేస్తున్నట్లు చెప్పారు.
"సేవా పరమో ధర్మ అనే సూత్రంపై భారత్ నడుస్తుంది. అందుబాటులో ఉన్న కొన్ని వనరులతోనే భారత్ టీకాలను తయారు చేసింది. మానవాళి పట్ల బాధ్యతతో అవసరమైనవారికి టీకాలు అందించడం మళ్లీ ప్రారంభించింది. టీకా తయారీదారులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.. భారత్‌కు వచ్చి వ్యాక్సిన్లను తయారు చేయండి."
-నరేంద్ర మోదీ ప్రధానమంత్రి
'భారత్‌తోనే ప్రపంచం రూపాంతరం'
భారత్ అభివృద్ధి చెందితే ప్రపంచం అభివృద్ధి చెందుతుందని మోదీ (Modi UNGA 2021) ఉద్ఘాటించారు. భారత్‌లో సంస్కరణలు తీసుకొస్తే ప్రపంచం రూపాంతరం చెందుతుందని వ్యాఖ్యానించారు.
"ప్రపంచ ఆర్థిక వ్యవస్థ మరింత వైవిధ్యంగా తయారు కావాల్సిన అవసరం ఉందని కరోనా మహమ్మారి మనకు నేర్పించింది. అందుకే గ్లోబల్ వ్యాల్యూ చైన్ విస్తరణ జరగడం ముఖ్యం. ఈ విజన్ ఆధారంగానే మా 'ఆత్మనిర్భర్ భారత్ అభియాన్' రూపొందింది. అంత్యోదయ(ఎవరినీ విస్మరించకుండా ఉండటం) అనే సూత్రంతో భారత్ ముందుకు సాగుతోంది. అభివృద్ధి అనేది సమ్మిళితంగా, సర్వవ్యాప్తంగా, సార్వత్రికంగా, అందరికీ ఫలాలు అందేలా ఉండాలి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
ఉగ్రవాదంపై హెచ్చరిక
ఈ సందర్భంగా ఉగ్రవాదంపై కీలక వ్యాఖ్యలు చేశారు మోదీ. పరోక్షంగా పాకిస్థాన్‌ను ప్రస్తావిస్తూ.. కొన్ని దేశాలు ఉగ్రవాదాన్ని రాజకీయంగా వాడుకుంటున్నాయన్న మోదీ.. దీని వల్ల తమకు కూడా ముప్పు ఉంటుందన్న విషయాన్ని అర్థం చేసుకోవాలని హితవు పలికారు. అఫ్గాన్ భూభాగం ఉగ్రవాదులు ఉపయోగించుకోకుండా చూడటం చాలా అవసరమని అన్నారు. ఇక్కడ ఉన్న బలహీనమైన పరిస్థితులను ఎవరూ తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకోకుండా చూడాలని పిలుపునిచ్చారు.
"ప్రస్తుత సమయంలో అఫ్గానిస్థాన్ ప్రజలకు, ముఖ్యంగా అక్కడి మహిళలు, చిన్నారులు, మైనారిటీలకు సహాయం కావాలి. మనం మన బాధ్యతను నెరవేర్చాలి. ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేసేందుకు అఫ్గానిస్థాన్ భూభాగాన్ని ఉపయోగించుకోకుండా చూడటం చాలా ముఖ్యం."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
దక్షిణ చైనా సముద్రంలో దూకుడు ప్రదర్శిస్తున్న చైనాకు పరోక్షంగా చురకలు అంటించారు మోదీ. మహాసముద్రాలు అంతర్జాతీయ వర్తకానికి జీవనాధారమని అన్నారు. అందువల్ల వాటిని విస్తరణవాదం నుంచి కాపాడాలని పిలుపునిచ్చారు.
ఐరాసలో మార్పు అవసరం
ఐక్యరాజ్య సమితి ప్రస్తుత అవసరాలకు తగినట్లు తనను తాను మార్చుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు మోదీ. ఐరాస ప్రభావాన్ని, విశ్వసనీయతను పెంచాలని అన్నారు. ఈ సందర్భంగా చాణక్యుడు చెప్పిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
"సరైన సమయంలో సరైన చర్యలు తీసుకోకపోతే.. అదే వైఫల్యానికి దారితీస్తుంది. ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా ఉండాలని ఐరాస అనుకుంటే.. తన విశ్వసనీయత, సమర్థతను మెరుగుపర్చుకోవాల్సి ఉంటుంది. ప్రపంచవ్యాప్తంగా చట్టబద్ధ పాలన ఉండాలంటే.. ఐరాసను నిరంతరం బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి
నాలుగు రోజుల పర్యటనలో భాగంగా మోదీ అమెరికా వెళ్లారు. ఆ దేశ అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్‌తో ఇదివరకే భేటీ అయ్యారు.
ఇవీ చదవండి:
'భారత్‌కు యూఎన్‌ఎస్సీలో శాశ్వత సభ్యత్వం ఉండాలి'
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌తో మోదీ తొలిసారి కీలక భేటీ!