కొద్దిరోజులుగా మానవులతో పాటు.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలను కుదిపేస్తోంది కరోనా మహమ్మారి. ఆంక్షలబాట పట్టించి మనుషులను బందీ చేసిన వైరస్ బారినుంచి ఎప్పుడు బయటపడతామా అన్నట్లుంది పరిస్థితి. టీకా మందు వచ్చేంత వరకు కొవిడ్-19తో కలిసి గడపక తప్పని పరిస్థితుల్లో 'సరికొత్త సాధారణం' రాబోతోంది. గత మహమ్మారులు, విపత్తులను పరిశీలిస్తే తదనంతర కాలంలో పెద్ద మార్పులేమీ రాలేదని మోర్గాన్ స్టాన్లీ చీఫ్ గ్లోబల్ స్ట్రాటజిస్టు రుచిర్ శర్మ 'ఇండియాటుడే ఈ-కాంక్లేవ్'లో తెలిపారు. ఏదేమైనప్పటికీ లాక్‌డౌన్ తర్వాతి కాలంలో ఏడు రకాల ట్రెండ్స్ కనిపిస్తాయని అంచనా వేశారు. అవేంటంటే..
ప్రపంచీకరణకు దూరం!
సరికొత్త సాధారణంలో ప్రపంచీకరణపై అతిగా ఆధారపడకపోవచ్చు. ఎగుమతులు, దిగుమతులు, పెట్టుబడులు, వలసలు తగ్గుముఖం పడతాయి. ప్రపంచ జీడీపీలో అంతర్జాతీయ వాణిజ్యం వాటా 53శాతం పడిపోనుంది. ఎందుకంటే ఇప్పటికే మందగమనం ఛాయలు కనిపిస్తున్నాయి. అనేక దేశాల్లో జాతీయవాదం కనిపించనుంది. ప్రత్యేకంగా ఆహార పరిశ్రమలో ఈ ధోరణి ఎక్కువగా ఉంటుంది. తిండిగింజల కోసం ఇతర దేశాలపై ఆధాపడొద్దని భావిస్తాయి. ఇది భారత్‌లాంటి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రభావం చూపనుంది. చైనా తరహాలో భారత్ బియ్యం, గోధుమల వంటివి ఎగుమతి చేయలేకపోవచ్చు.
'ఉక్కు' నేతలు
కరోనా వైరస్ తరహా సంక్షోభాలు ప్రజాస్వామ్య మందగమనానికి కారణం కావొచ్చు. అధికారం కొందరు నాయకుల వద్దే కేంద్రీకృతం కావొచ్చు. ఉదాహరణకు బెర్లిన్ గోడ కూలిపోవడం వల్ల ప్రజాస్వామ్యం విస్తరించింది. 2008-09 ఆర్థిక సంక్షోభం తర్వాత ప్రపంచ వ్యాప్తంగా నియంతృత్వ నాయకులు పెరిగారు! రష్యా, టర్కీ వంటి దేశాల్లో ఇది ప్రతిబింబించింది. సాధారణంగా సంక్షోభ కాలంలో నాయకుల ప్రజాదరణ విపరీతంగా పెరుగుతుంది. గతంలో ప్రధాని మోదీతో విభేదించే చాలామంది లాక్‌డౌన్‌లో మద్దతుగా నిలుస్తున్నారు. వ్యాపార, వాణిజ్యం సహా అన్నింట్లోనూ వారి జోక్యం అవసరం అవుతుంది. ఆ తర్వాత దాన్ని తొలగించడం కష్టమవుతుంది.
కేంద్ర బ్యాంకుపై ఒత్తిడి
ఆర్బీఐ లాంటి కేంద్ర బ్యాంకులు స్వతంత్రంగా పనిచేయడం అవసరం. కానీ సంక్షోభ కాలంలో ప్రజలను ఆదుకొనేందుకు ఉద్దీపన ఇవ్వాలని వాటిపై ఒత్తిడి పెరుగుతుంది. ఫలితంగా కేంద్ర బ్యాంకుల ఆస్తి, అప్పుల పట్టీ అస్తవ్యస్థం అవుతుంది. ప్రభుత్వ రుణాలు కొనుగోలు చేయాలనే ఒత్తిడి పెరుగుతుంది. ప్రపంచ జీడీపీలో ప్రస్తుత ఆర్థిక ఉద్దీపనలు నాలుగు శాతంగా ఉన్నాయి. భారత్ జీడీపీలో ఇది ఒక శాతానికి పైగా ఉంది. ఆర్థిక లోటు ఎక్కువ కావడం వల్ల ఇంతకన్నా అధికంగా ఇచ్చేందుకు వీలుండదు. డబ్బులు ముద్రించి ఉద్దీపనలు ప్రకటిస్తే ఆర్థిక వ్యవస్థకు ప్రమాదం. విశ్వాసం సన్నగిల్లుతుంది.
రుణ భయం
సాధారణంగా రుణాలు గృహ, ప్రభుత్వ, ఆర్థిక, కార్పొరేట్ అనే రకాలుగా ఉంటాయి. 2008 ఆర్థిక సంక్షోభం తర్వాత వినియోగ, కార్పొరేట్ రుణాల్లో తగ్గుదల నమోదైంది. తమకు అప్పుల భారం అతిగా ఉందని ప్రస్తుతం కంపెనీలన్నీ గ్రహించాయి. ఇప్పుడీ రుణభయం మిగతా రంగాలకూ వ్యాపిస్తుంది. భారత్‌లో ఎక్కువ క్రెడిట్ రేటింగ్ లేకుంటే రుణ లభ్యత కష్టం. చిన్న, సూక్ష్మ, మధ్య తరహా సంస్థలు దివాళా తీయొద్దంటే ఆర్‌బీఐ జోక్యం అవసరం అవుతుంది. ఉద్దీపనలు నష్టాన్ని భర్తీ చేయలేవని, వ్యాపారాలను తిరిగి తెరిపించడమే మార్గమని ప్రభుత్వాలు అర్థం చేసుకుంటున్నాయి. భారత్‌లో ఒక నెల లాక్‌డౌన్ అయితే ఏడాదికి జీడీపీ 1.5-2 శాతం తగ్గుతుంది. అదే మూడు నెలలైతే 6 శాతం వరకు ఉంటుంది.
సమస్తం ఆన్‌లైన్‌లోనే..
కరోనా మహమ్మారి కాలంలో వీడియో కాన్ఫరెన్స్‌లు పెరిగిపోయాయి. సమయం గడిపేందుకు వీడియో గేమ్‌లు ఎక్కువగా ఆడుతున్నారు. ప్రజలు ఎక్కువగా స్ట్రీమింగ్ వైపు మళ్లితే సినిమా, థియేటర్ల పరిశ్రమపై ప్రభావం పడుతుంది. వర్చువల్ ఎకానమీ వైపు వెళ్లేందుకు 5-10 ఏళ్లు పడుతుందని భావించినా కరోనాతో 5-6 వారాల్లోనే సాధ్యమైంది. మార్పు వేగంగా సాగుతోంది.
ఉత్పత్తికి ఆటోమేషన్
ఇప్పటికీ కొన్ని సంస్థలు ఉద్దీపన, సులభ ద్రవ్యంతో కాలం వెలిబుచ్చుతున్నాయి. ఇప్పుడవి మూతపడే అవకాశముంది. ఎందుకంటే ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యం లేని సంస్థలు దీర్ఘకాలంలో ఎదగలేవు. మనుగడ కష్టమవుతుంది. ఇప్పుడు ఎక్కువ ఉత్పత్తి సామర్థ్యాన్ని (ప్రొడక్టివిటీ) సాధించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇంటి నుంచి పనిచేయడం సౌకర్యంగా ఉందని చాలామంది భావిస్తున్నారు. ఆటోమేషన్‌తో ఉత్పత్తి పెరగనుంది.
సంక్షోభంలో అవకాశాలు
కష్టకాలంలో భయాన్ని జయించడం అత్యంత ముఖ్యం. లాక్‌డౌన్ తర్వాత మన భయాల్ని తొలగించే నాయకత్వం అవసరం. భయపడకుండా పోరాడటం ఎలాగో చెప్పే వారు కావాలి. ఆర్థిక సంస్కరణలు చేపట్టేందుకు ఈ అవకాశాన్ని ఒడిసిపట్టాలి. మరిన్ని పెట్టుబడులు, మరింత ప్రైవేటైజేషన్, మరిన్ని కార్మిక సంస్కరణలు తీసుకురావాలి. వ్యాపారాల్లో రాజకీయ నాయకులు, అధికారుల అతిజోక్యం లేకుండా చూడాలి.
ఇదీ చదవండి: శానిటైజర్ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం