కరోనాను జయించడంలో ఆర్ఎల్ఎఫ్-100(అవిప్టడిల్) ఔషధం ప్రభావవంతంగా పనిచేస్తుందని వెల్లడించింది అమెరికాకు చెందిన ప్రముఖ ఔషధ తయారీ సంస్థ న్యూరో ఆర్ఎక్స్. నిపుణులు ధ్రువీకరించిన ఈ ఔషధం కరోనా నుంచి వేగంగా కోలుకునేందుకు దోహదపడుతోందని.. శ్వాసకోశ సమస్యల నుంచి సత్వర ఉపశమనం ఇస్తోందని తెలిపింది.
హ్యూస్టన్‌కు చెందిన ఓ 54 ఏళ్ల వ్యక్తి కరోనా సోకి తీవ్ర అస్వస్థతకు లోనయ్యారు. మెథడిస్ట్ ఆసుపత్రిలో వెంటిలేటర్‌పై శ్వాస తీసుకుంటున్న ఆయనకు మూడు రోజుల పాటు ఆర్ఎల్ఎఫ్-100 మాత్రలు వేస్తూ చికిత్స చేయగా.. నాలుగో రోజు వెంటిలేటర్ అవసరం లేకుండానే శ్వాస తీసుకోగలిగారు. మరో 15 మందిలోనూ ఇదే రకమైన ఫలితాలు కనిపించినట్లు వైద్యులు తెలిపారు.
"ఏ ఇతర యాంటీ వైరల్ ఔషధాలు కూడా ఇంత వేగమైన ఫలితాలనివ్వలేదు. ఆర్ ఎల్ ఎక్స్-100 వైరస్ వృద్ధిని నియంత్రిస్తోంది."
- జోనతన్ జావిత్ , న్యూరో ఆర్ఎక్స్ ఛైర్మన్, సీఈఓ
"ఆర్ఎల్ఎఫ్-100తో రక్తంలో ఆక్సిజన్ స్థాయి మెరుగుపడుతోంది. కరోనా బారి నుంచి 50 శాతానికిపైనే ఉపశమనాన్నిస్తోంది. ఛాతీలో నిలిచిన నిమ్మును తగ్గిస్తోంది" అని న్యూరో ఆర్ఎక్స్ పరిశోధకులు వెల్లడించారు. ఊపిరితిత్తులు, తెల్లరక్త కణాల్లో కరోనా వైరస్ వృద్ధిని అడ్డుకుంటూ.. వేగంగా కోలుకునేలా చేస్తోందన్నారు. అయితే, మరికొందరిపై ప్రయోగం చేశాకే ఈ ఔషధాన్ని మార్కెట్లోకి విడుదల చేయనున్నట్లు స్పష్టం చేశారు.
అత్యవసర పరిస్థితిలో ఈ ఔషధాన్ని ఉపయోగించేందుకు ఇప్పటికే అమెరికా ఆహార, ఔషధ నియంత్రణ సంస్థ అనుమతి ఇచ్చింది.
ఇదీ చదవండి: తక్కువ ధరకే మార్కెట్లోకి ఫావిపిరవిర్ ట్యాబ్లెట్లు