అఫ్గానిస్థాన్(Afghan news) నుంచి అమెరికా బలగాలను ఉపసంహరించిన తీరు చాలా అసమర్థంగా జరిగిందని అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) ఆరోపించారు. ఇలాంటి దారుణమైన ఉపసంహరణ ప్రక్రియను చరిత్రలో ఏ యుద్ధంలోనూ చూడలేదంటూ జో బైడెన్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. అఫ్గాన్ గడ్డపై 20ఏళ్ల సుదీర్ఘ యుద్ధానికి సంపూర్ణ ముగింపు పలుకుతూ అమెరికా రక్షణ దళాల చిట్టచివరి విమానం సోమవారం అర్ధరాత్రి కాబుల్ నుంచి బయల్దేరింది. దీనిపై ట్రంప్ స్పందిస్తూ బైడెన్ సర్కారుపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంతేగాక, అఫ్గాన్‌లో అమెరికా వదిలేసి వచ్చిన సైనిక పరికరాలను తిరిగి తెచ్చుకోవాలని అన్నారు.
"అఫ్గాన్‌లో ఉన్న అన్ని అమెరికా సైనిక పరికరాలను తక్షణమే తిరిగివ్వాలని డిమాండ్ చేయాలి. యుద్ధంలో అమెరికా ఖర్చు చేసిన 85 బిలియన్ డాలర్లలో ప్రతి పైసా తిరిగి తెచ్చుకోవాలి. ఆ పరికరాలను తిరిగివ్వకపోతే మళ్లీ అక్కడకు సైన్యాన్ని పంపి వాటిని తీసుకురండి. లేదంటే కనీసం బాంబులేసి వాటిని నాశనం చేయండి. ఇలాంటి బలహీనమైన, మూర్ఖత్వపు ఉపసంహరణ ప్రక్రియను ఎవరూ ఊహించలేదు"
-డొనాల్డ్ ట్రంప్, అమెరికా మాజీ అధ్యక్షుడు
అఫ్గాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ చాలా అవమానకరంగా ఉందని ఐరాసకు అమెరికా మాజీ రాయబారి నిక్కీ హేలీ ఆరోపించారు. అమెరికా పౌరులు, అఫ్గాన్ మిత్రులను ఉగ్రవాదుల పాలనలో వదిలిపెట్టి రావడం సిగ్గుచేటని దుయ్యబట్టారు. వారికి ఏదైనా జరిగితే తప్పు బైడెన్‌దే అవుతుందన్నారు.
పనికిరాకుండా చేసి..
కాబుల్ ఎయిర్‌పోర్టు నుంచి చివరి విమానం వైదొలిగే ముందు అక్కడ వదిలేసిన విమానాలు, ఇతర సాయుధ వాహనాలను అమెరికా సైన్యం ధ్వంసం చేసినట్లు యూఎస్ సెంట్రల్ కమాండ్ హెడ్ జనరల్ మెకంజీ తెలిపారు. 73 విమానాలు, హైటెక్ రాకెట్ డిఫెన్స్ వ్యవస్థను నిర్వీర్యం చేసినట్లు వెల్లడించారు. ఆ విమానాలు ఇక ఎగరలేవని, సాయుధ వాహనాలు, రక్షణ వ్యవస్థను మళ్లీ ఎవరూ వినియోగించలేరని అన్నారు.
ఆగస్టు 14న తరలింపు ప్రక్రియ మొదలైన నాటి నుంచి దాదాపు 6వేల మంది అమెరికా బలగాలు కాబుల్ ఎయిర్‌పోర్టులో(Kabul Airport) మెహరించారు. వీరు ఉపయోగించిన సాయుధ వాహనాలను వెళ్లేముందు పనికిరాకుండా చేశారు. వీటి ధర ఒక్కోటి 1 మిలియన్ డాలర్ల వరకు ఉంటుంది. ఇక 27 హంవీస్, చినూక్ హెలికాప్టర్లు, రాకెట్లను కూల్చివేసే సీ-ర్యామ్ క్షిపణి వ్యవస్థను కూడా ఎయిర్‌పోర్టులోనే వదిలేశారు. ఈ రక్షణ వ్యవస్థను ఉపయోగించే సోమవారం ఐదు రాకెట్లను అమెరికా కూల్చేసింది. అయితే ఇవన్నీ ఉగ్రవాదుల చేతికి చిక్కకుండా నిన్న రాత్రి వీటిని నిర్వీర్యం చేసినట్లు మెకంజీ వెల్లడించారు.
ఇదీ చూడండి: Afghan Taliban: 'అఫ్గాన్‌కు పూర్తి స్వాతంత్య్రం'.. సంబరాల్లో తాలిబన్లు
ఇదీ చూడండి: Afghanistan Journalist: అఫ్గాన్‌ను వీడిన 'ఆమె'..!