కరోనా వైరస్ వల్ల మృతి చెందిన బాధితుల్లో ఐదో వంతు మందికి మాత్రమే వెంటిలేటర్ సదుపాయం అందినట్లు తెలుస్తోంది. చైనాలో కరోనా బాధితుల చికిత్స విధానంపై చేసిన అధ్యయనం ఈ విషయాన్ని వెల్లడించింది.
ఈ పరిశోధన అమెరికన్ మెడికల్ అసోసియేషన్ జర్నల్‌లో ప్రచురితమైంది. వుహాన్‌లోని 21 ఆసుపత్రుల నుంచి సేకరించిన డేటా ఆధారంగా ఈ అధ్యయనం చేశారు పరిశోధకులు.
రోగుల్లో 33 శాతం మందికి..
మూడో వంతు రోగులకు మాత్రమే వెంటిలేషన్ సదుపాయం కల్పించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఈ వివరాలన్నింటినీ పరిశీలించిన శాస్త్రవేత్తలు.. కరోనా బాధితులకు కృత్రిమ శ్వాస అందించటంలో ఆలస్యం జరిగిందని అంచనాకు వచ్చారు. ఫలితంగా మరణాలు ఎక్కువగా సంభవించినట్లు తెలిపారు.
ఈ పరిస్థితి ఏర్పడటానికి గల కారణాలనూ వివరించారు పరిశోధకులు.
- రక్తంలో తక్కువ స్థాయిలో ఆక్సిజన్ ఉన్న కొంతమంది రోగులకు శ్వాసలో ఇబ్బందులు లేదా డిస్నియా వంటి లక్షణాలు లేకపోవటం.
- కృత్రిమ శ్వాస అందించేందుకు వెంటిలేటర్లు కూడా తగినంత సంఖ్యలో లేకపోవటం.
- వైద్య బృందాల్లో సీనియర్ల కొరత మరో ముఖ్య కారణం. ఫలితంగా రోగికి కృత్రిమ శ్వాస అవసరమో కాదో వైద్యులు నిర్ధరించలేకపోయారు.
కరోనా వల్ల చనిపోయిన రోగుల్లో ప్రతి ఒక్కరికి అధిక రక్తపోటు లక్షణాలు కనిపించినట్లు ఈ అధ్యయనం గుర్తించింది.
ఇదీ చూడండి: భౌతిక దూరం లక్ష్యంతో 'బ్లూటూత్ స్టెతస్కోప్' ఆవిష్కరణ