కొవిడ్ కారణంగా ఈ ఏడాది ప్రారంభంలో ప్రపంచవ్యాప్తంగా 15 కోట్ల మంది పిల్లలు పేదరికంలోకి జారుకున్నట్లు ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఈ అన్ని రంగాల్లోనూ కనీస స్థాయికి దిగువన నివసిస్తున్న పిల్లల సంఖ్య దాదాపు 120 కోట్లకు చేరుకుందని పేర్కొంది.
విద్య, ఆరోగ్యం, ఇళ్లు, షోషణ, పారిశుద్ధ్యం, నీరు అందుబాటులో లేకుండా కడు పేదరికంలో చిన్నారులు జీవిస్తున్నారని యునిసెఫ్, సేవ్ ద చిల్డ్రన్ కలిసి సంయుక్తంగా నివేదించాయి. మొత్తం 70 దేశాలకు పైగా సంబంధించిన డేటాను విశ్లేషించినట్లు తెలిపాయి. కరోనా వచ్చినప్పటి నుంచి ఈ సంఖ్య 15 శాతం పెరిగిందని పేర్కొన్నాయి. దీనిని బట్టి ఈ ఏడాది ప్రారంభంలో 15 కోట్ల మంది పేదరికంలోకి వచ్చారని ఆవేదన వ్యక్తం చేశాయి.
"మహమ్మారి రాక మందు విశ్లేషించిన దేశాల్లో 45 శాతం మంది పిల్లలు తీవ్ర సమస్యలతో బాధపడుతున్నట్లు తేలింది. ఇప్పటికే ఎన్నో ఇబ్బందులు పడుతున్న వీరు రాబోయే కాలంలో మరింత గడ్డు కాలాన్ని అనుభవిస్తారు" అని యునిసెఫ్ వెల్లడించింది. పేద పిల్లలు మరింత పేదరికంలోకి జారుకుంటున్నట్లు పేర్కొంది. ఈ పరిస్థితిని ఎదుర్కొనేందుకు ఆయా దేశాల ప్రభుత్వాలతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు సేవ్ ద చిల్డ్రన్, యునిసెఫ్ ప్రకటించాయి.
"కరోనా వ్యాప్తిని అరికట్టేందుకు విధించిన లాక్డౌన్ కారణంగా పిల్లలు పేదరికంలోకి వెళ్లారు. అంతేకాకుండా పేదరికంలో నుంచి బయటకు వస్తున్న కుటుంబాలను కూడా కరోనా వెనక్కి లాగేసింది. మరి కొందరు ఎన్నడూ లేని స్థాయిలో పేదరికాన్ని చవి చూస్తున్నారు." అని యునిసెఫ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెన్రిట్టా ఫోర్ అన్నారు.
పిల్లలను పేదరికం నుంచి రక్షించటానికి సమగ్ర ఆర్థిక విధానాలు రూపొందించాలని యునిసెఫ్ సూచించింది. సామాజిక భద్రతా పథకాలకు నిధులు పెంచటం, ఉపాధి కల్పించటం వంటి చర్యలు చేపట్టాలని తెలిపింది. నాణ్యమైన పౌష్టికాహారం అందించటం, విద్యకు కావాల్సిన సాంకేతిక సాయం అందించాలని స్పష్టం చేసింది. మధ్యాహ్న భోజన పథకం, ఆరోగ్య కేంద్రాలు, ఇతర సేవలను అందించటం ద్వారా పిల్లలను పేదరికంలోకి జారకుండా చేయవచ్చని సేవ్ ద చిల్డ్రన్ సీఈఓ ఇంగర్ ఆషింగ్ అభిప్రాయపడ్డారు.