కరోనా వైరస్ వేర్వేరు దేశాల్లో మరో 1,014 మందిని బలిగొంది. ఫలితంగా ఇప్పటివరకు ఆ మహమ్మారి కారణంగా మరణించిన వారి సంఖ్య 14,685కి చేరింది. నేడు కొత్తగా 21, 350మందికి పైగా వైరస్ సోకింది. మొత్తంగా బాధితుల సంఖ్య 3,38,680కి చేరింది.
చైనా, ఇటలీ, అమెరికా, స్పెయిన్, జర్మనీ, ఇరాన్ దేశాల్లో వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉంది. ఆయా దేశాల్లో వైరస్ సోకిన, మరణించిన వారి వివరాలు.
దేశం | బాధితులు | మరణాలు |
చైనా | 81,093 | 3270 |
ఇటలీ | 59, 138 | 5476 |
అమెరికా | 34, 673 | 450 |
స్పెయిన్ | 28, 768 | 1772 |
జర్మనీ | 24, 873 | 94 |
ఇరాన్ | 21, 638 | 1685 |
ఫ్రాన్స్ | 16, 018 | 674 |
దక్షిణ కొరియా | 8,961 | 111 |
స్విట్జర్లాండ్ | 7474 | 98 |
బ్రిటన్ | 5683 | 281 |
వైరస్ సోకిన తమ పౌరుల్లో 96 వేల మందికి వ్యాధి నయమైనట్లు చైనా ప్రకటించింది.
బయటకొస్తే 5వేల యూరోల ఫైన్..
వైరస్ ప్రభావిత దేశాల్లో రెండో స్థానంలో ఉన్న ఇటలీ వ్యాధి నియంత్రణ కోసం ఆంక్షలను మరింత కఠినతరం చేసింది. వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న లాంబోర్డీ ప్రాంతంలో వ్యక్తిగత వాహనాలతో బయట తిరగడంపై ఆంక్షలు విధించింది. ఇంటికి 200 మీటర్ల దూరం వరకే పెంపుడు శునకాలను వాకింగ్‌కు తీసుకెళ్లాలని పరిమితి విధించింది. ప్రభుత్వ ఆదేశాలను ఉల్లంఘిస్తే 5వేల యూరోల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.
పాక్‌లో 799మందికి..
పాకిస్థాన్‌లో 799 మందికి కరోనా సోకింది. ఐదుగురు మరణించారు. వైరస్ సోకిన వారికి చికిత్స అందించిన వైద్యుడు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ప్రభుత్వ నిర్లక్ష్యపూరిత వైఖరే వైద్యుడి ప్రాణాలు తీసిందని పాకిస్థాన్ వైద్య మండలి ఆరోపణలు చేసింది. కరోనాపై పోరాటానికి సిద్ధంగా ఉందని సైనిక దళాల ప్రధాన అధికారి జనరల్ జావెద్ భాజ్వా స్పష్టంచేశారు.
సౌదీలో రాత్రి కర్ఫ్యూ..
కరోనా నియంత్రణ కోసం నిబంధనలు కఠినతరం చేసింది సౌదీ అరేబియా. 21 రోజులపాటు రాత్రి 7 గంటల నుంచి ఉదయం 6 గంటలవరకు రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించింది. సౌదీలో ఇప్పటివరకు 511మందికి వైరస్ నిర్ధరణ అయిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. అత్యవసర సేవల విభాగాలను ఈ కర్ఫ్యూ నుంచి మినహాయించింది.
ఇదీ చూడండి: చైనాలో దేశీయ కేసులు సున్నా... కానీ