గ్రీన్ హౌస్ ఉద్గారాలను తగ్గించడానికి అమలు చేయాల్సిన నూతన ప్రణాళికలను ఐక్యరాజ్య సమితికి సమర్పించడంలో విఫలమైన దేశాల జాబితాలో భారత్, చైనా చేరాయి. ఐరాస నిర్దేశించిన గడువులోపు ఈ దేశాలు తమ లక్ష్యాలను సమర్పించలేకపోయాయని అధికారులు తెలిపారు.
గ్లోబల్ వార్మింగ్ కట్టడి కోసం తమ నూతన లక్ష్యాల వివరాలు అందజేయాలని ఐక్యరాజ్య సమితి.. 2021, జులై 31 వరకు గడువు విధించింది.
ఏప్రిల్‌లోనే అమెరికా...
ప్రపంచంలో కర్బన ఉద్గారాలను అధికంగా విడుదల చేసే జాబితాలో చైనా మొదటి స్థానంలో ఉండగా.. భారత్ మూడో స్థానంలో ఉంది. ఉద్గారాలను అధికంగా విడుదల చేసే రెండో దేశమైన అమెరికా.. ఏప్రిల్‌లోనే తమ లక్ష్యాలను ఐక్యరాజ్య సమితికి సమర్పించింది. యునైటెడ్ నేషన్స్ ఫ్రేమ్‌వర్క్ కన్వెన్షన్ ఆన్ క్లైమేట్ ఛేంజ్(యూఎన్ఎఫ్సీసీసీ)లో భాగమైన 110 దేశాల్లో 58శాతం దేశాలు మాత్రమే తన నూతన లక్ష్యాలను నిర్దేశించిన గడువులోగా సమర్పించాయని యూఎన్ఎఫ్సీసీసీ ఛైర్మన్ పాట్రిసియా ఎస్పిసోనా తెలిపారు. ఈ వివరాలు అందించాల్సిన గడువు 2020 డిసెంబర్ నాటికే ముగిసినప్పటికీ... కరోనా కారణంగా జులై 31 వరకు పొడిగించినట్లు గుర్తు చేశారు.
"సౌదీ అరేబియా, దక్షిణాఫ్రికా, సిరియా సహా మరో 82 దేశాలు తమ లక్ష్యాలను ఐరాసకు సమర్పించని జాబితాలో ఉన్నాయి. ఈ శతాబ్దం ముగిసేనాటికి గ్లోబల్ వార్మింగ్‌ను రెండు డిగ్రీల సెల్సియస్ లోపునకు పరిమితం చేయాలనే లక్ష్యం దిశగా దేశాలన్నీ చాలా తక్కువ చర్యలు చేపట్టాయి. ప్రపంచవ్యాప్తంగా ఇటీవల ఏర్పడ్డ హీట్‌వేవ్స్, కరవులు, వరదలు వంటివి గ్లోబల్ వార్మింగ్‌ను కట్టడి చేయాలనేందుకు హెచ్చరికలు. ప్రస్తుతం మనం అనుసరిస్తున్న విధానాలను తక్షణమే మార్చుకోవాల్సి ఉంది. ఇది అన్ని దేశాల సహకారంతోనే సాధ్యమవుతుంది."
-పాట్రిసియా ఎస్పిసోనా, యూఎన్ఎఫ్సీసీసీ ఛైర్మన్
2030 కంటే ముందే కార్బన్ డై ఆక్సైడ్ ఉద్గారాలను సున్నా శాతానికి పరిమితం చేసి, 2060 నాటికి తటస్థం చేస్తామని చైనా గతేడాది ప్రకటించింది. అయితే.. ఈ లక్ష్యాన్ని ఐక్యరాజ్య సమితికి అధికారికంగా సమర్పించాల్సి ఉంది.
ఇవీ చూడండి: