లద్ధాఖ్లోని గాల్వన్ లోయ ప్రాంతంలో చైనా తన సైనిక బలగాలను మోహరించడంపై అమెరికా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత్‌కు మద్దతుగా నిలిచిన అగ్రరాజ్యం... చైనా చేపడుతున్న చర్యలు శాంతిని భంగపరిచే విధంగా, రెచ్చగొట్టేలా ఉన్నాయని వ్యాఖ్యానించింది.
భారతదేశానికి చెందిన లద్ధాఖ్లోని గాల్వన్ లోయ, పాంగాంగ్ త్సో సరస్సు వద్ద... చైనా అదనపు బలగాలను మోహరిస్తోంది. సరస్సులో అదనపు పడవలను తెస్తుంది. ఈ ప్రాంతంలో భారత్ అక్రమ సైనిక నిర్మాణాలు చేపడుతోందని చైనా ఆరోపిస్తోంది.
మే 5న ఇరుదేశాల సైనికులు తూర్పు లద్ధాఖ్‌లో ఘర్షణపడ్డారు. నాలుగు రోజుల తర్వాత ఉత్తర సిక్కింలోని నకులా పాస్ వద్ద ఇదే తరహా ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనల తరువాత చైనా దూకుడు పెంచింది. డెమ్చోక్, దౌలత్ బేగ్ ఓల్డీ ప్రాంతాల్లోనూ తన సైనిక బలగాలను గణనీయంగా పెంచింది. దీటుగా స్పందించిన భారత్ కూడా ఆయా ప్రాంతాల్లో అదనపు బలగాలను మోహరించింది.
ఇండో చైనా సరిహద్దు వివాదాలు
భారత్- చైనాలు 3,488 కి.మీ మేర సరిహద్దును పంచుకుంటున్నాయి. ఇరుదేశాల మధ్య అనేక సరిహద్దు వివాదాలు కొనసాగుతున్నాయి. భారత భూభాగమైన అరుణాచల్‌ప్రదేశ్‌ను దక్షిణ టిబెట్‌లోని భాగమని చైనా వితండవాదం చేస్తూవస్తోంది.
దక్షిణ చైనా సముద్రం విషయంలోనూ..
వ్యూహాత్మక దక్షిణ చైనా సముద్రం విషయంలోనూ చైనా ప్రవర్తన రెచ్చగొట్టేలా ఉందని అమెరికా విదేశాంగ శాఖకు చెందిన 'దక్షిణ, మధ్య ఆసియా బ్యూరో' హెడ్ అలిస్ జీ వెల్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దక్షిణ చైనా సముద్రంపై సార్వభౌమాధికారం ప్రకటించుకున్న చైనా... వియత్నాం, మలేసియా, ఫిలప్పీన్స్, బ్రూనై, తైవాన్ల హక్కులను కాలరాస్తోందని ఆమె ఆరోపించారు.
అన్నీ ఆక్రమిస్తున్న చైనా...
ఖనిజాలు, ముడిచమురు, ఇతర సహజవనరులు సమృద్ధిగా ఉన్న ... దక్షిణ చైనా సముద్రం, తూర్పు చైనా సముద్రం రెండింటిపైనా చైనా తన అధికారాన్ని ప్రకటించుకుంటోంది. ఈ సముద్రాల్లోని అనేక ద్వీపాలను ఆక్రమించి, అక్కడ తన సైన్యాలను నిలుపుతోంది.
'ప్రపంచ వాణిజ్యానికి ఎంతో కీలకమైన ఈ రెండు సముద్రాలను నియంత్రిస్తున్న చైనా... స్వేచ్ఛా వాణిజ్యానికి భంగం కలిగిస్తూ... తను మాత్రం అక్రమంగా లాభపడుతోంది. ఇలాంటి పరిస్థితుల్లో.. రెండో ప్రపంచ యుద్ధానంతరం నిర్దేశించుకున్న ఆర్థిక సూత్రాలను ఎలా అమలుచేయగలుగుతాం' అని వెల్స్ అసహనం వ్యక్తం చేశారు.
ఇదీ చూడండి: 'కాలాపానీ'పై నేపాల్‌కు భారత్ కౌంటర్-చారిత్రక ఆధారాలేవి!