బూస్టర్ డోసుపై డబ్ల్యూహెచ్‌ఓ అసంతృప్తి - బూస్టర్ డోసు
అభివృద్ధి చెందిన దేశాల్లో.. రెండు డోసులు పూర్తయిన వారికి బూస్టర్ డోసులు ఇస్తుండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. ఈ మేరకు బూస్టర్ డోసుల పంపిణీ వెంటనే ఆపేయాలని డబ్ల్యూహెచ్‌ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ అన్నారు.
కరోనా వ్యాప్తిని అరికట్టే టీకాలు దాదాపు అన్ని దేశాల్లో అందుబాటులోకి వచ్చినప్పటికీ పలు కారణాల వల్ల ఇంకా కొన్ని దేశాల్లో వ్యాక్సినేషన్ నెమ్మదిగా సాగుతోంది. అయితే కొన్ని అభివృద్ధి చెందిన దేశాల్లో మాత్రం రెండు డోసుల పూర్తయిన వారికి బూస్టర్ డోసులు కూడా ఇస్తున్నారు. దీనిపై ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని వెంటనే ఆపాలని అన్నారు.
"ప్రతి రోజూ.. పేద దేశాల్లో ప్రైమరీ డోసుల పంపిణీ కంటే ఆరు రెట్లు ఎక్కువగా బూస్టర్ డోసుల పంపిణీ జరుగుతోంది. ఓవైపు తక్కువ ఆదాయం ఉన్న దేశాలు టీకాల కోసం ఎదురుచూస్తుంటే.. అధిక వ్యాక్సినేషన్ రేటు ఉన్న దేశాలు డోసుల నిల్వలను పెంచుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో ఆరోగ్య కార్యకర్తలు, వృద్ధులు, వ్యాధుల ముప్పు ఎక్కువగా ఉన్నవారు ఇంకా వారి తొలి డోసు కోసం ఎదురుచూస్తునే ఉన్నారు. వారిని వదిలిపెట్టి ఆరోగ్యంగా ఉన్నవారికి బూస్టర్ డోసులు పంపిణీ చేయడం, పిల్లలకు టీకా వేయడంలో అర్థం లేదు. బూస్టర్ డోసు పంపిణీని వెంటనే ఆపాలి. ఎంతమందికి వ్యాక్సిన్ వేస్తున్నామన్నది మాత్రమే కాదు.. ఎవరికి టీకాలు ఇస్తున్నామన్నది కూడా చాలా ముఖ్యం" అని టెడ్రోస్ తెలిపారు.
కొవాక్స్ కార్యక్రమం ద్వారా ఇప్పటివరకు 144 పేద దేశాలకు దాదాపు 500 మిలియన్ల వ్యాక్సిన్లను అందించినట్లు టెడ్రోస్ ఈ సందర్భంగా వెల్లడించారు. ఈ ఏడాది చివరి నాటికి ప్రపంచ జనాభాలో 40శాతం మందికి టీకాలు అందించాలని డబ్ల్యూహెచ్‌ఓ లక్ష్యంగా పెట్టుకుందని, ఇందుకోసం అదనంగా మరో 550 మిలియన్ల డోసులు అవసరమని తెలిపారు.
తక్కువ వ్యాక్సినేషన్ రేటు ఉన్న తూర్పు యూరప్ దేశాల్లో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో టెడ్రోస్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఐరోపాలో గత కొంతకాలంగా కరోనా మళ్లీ విజృంభిస్తోన్న విషయం తెలిసిందే. అక్కడ గతవారం ఏకంగా 20లక్షలకు పైగా కొత్త కేసులు వెలుగుచూడగా.. 27వేల మంది వరకు మరణించారు.
ఇదీ చూడండి: బెలూన్ ఫెస్టివల్.. మేఘాల అంచుకు పర్యటకులు!