జస్టిస్ ఎమీ కోనీ బారెట్‌ను సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా ఆమోదించింది అమెరికా సెనేట్. మరో వారం రోజుల్లో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న తరుణంలో.. తాను ఎంపిక చేసిన అభ్యర్థి విజయం సాధించడం అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌నకు కలిసొచ్చే విషయం.
52-48 తేడాతో ఎమీ విజయం సాధించగా.. ఒక్క డెమోక్రాట్ కూడా ఆమెకు అనుకూలంగా ఓటు వేయలేదు.
7వ యూఎస్ సర్క్యూట్ కోర్ట్ ఆఫ్ అప్పీల్స్ జడ్జిగా అమీ విధులు నిర్వర్తించారు. సెనెట్ ఆమోదంతో 115వ అసోసియేట్ జస్టిస్ ఆఫ్ సుప్రీంకోర్టుగా బాధ్యతలు చేపట్టనున్నారు ఎమీ. సుప్రీం కోర్టు న్యాయమూర్తి రూత్ బాడర్ గిన్స్‌బర్గ్ వారసురాలిగా బారెట్‌ను ప్రకటిస్తూ వైట్ హౌస్‌లో ట్రంప్ గత నెల 26న భారీ కార్యక్రమం నిర్వహించారు.
రిపబ్లికన్ల విజయం..
ఎమీ బారెట్ గెలవడం వల్ల రిపబ్లికన్లు విజయం సాధించినట్టు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. హైకోర్టు ఇచ్చే తీర్పులపై ప్రభావవంతమైన నిర్ణయాలు తీసుకునే అవకాశముండటం ఇందుకు కారణం.
సెనేట్ ప్రకటన వెలువడిన గంటల వ్యవధిలోనే ప్రమాణస్వీకారం చేశారు బారెట్. పదవిని చేపట్టడం ఎంతో గౌరవంగా ఉందన్నారు.
'ఇది చిరస్మరణీయం'
అమెరికా రాజ్యాంగం, నిష్పాక్షిక న్యాయ వ్యవస్థకు ఇదొక చిరస్మరణీయమైన రోజుగా అభివర్ణించారు అధ్యక్షుడు ట్రంప్. అత్యున్నత న్యాయస్థానంలో ఎమీ అసాధారణమైన న్యాయమూర్తిగా ఎదగాలని కోరుకుంటున్నట్టు స్పష్టం చేశారు.
అమెరికాలో సుప్రీంకోర్టు జస్టిస్‌కు పదవీ విరమణ ఉండదు. ఒకసారి ఎంపికైతే.. జీవితకాలం పాటు అత్యున్నత న్యాయస్థానానికి న్యాయమూర్తిగా వ్యవహరిస్తారు. ప్రస్తుతం మొత్తం 9మంది జడ్జిలు ఉండగా వారిలో ముగ్గురిని ట్రంప్ నామినేట్ చేశారు.
ఇదీ చూడండి:- ఆ రెండు రాష్ట్రాల్లో ప్రజా మద్దతు బైడెన్ కే!