Richa Chadha Tweet : బాలీవుడ్ నటి రిచా చద్దా చేసిన ఓ ట్వీట్ తీవ్ర వివాదాస్పదమైంది. 'Galwan says hi' అని ఆమె రాయడంతో నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తమైంది. ఆ వివాదాస్పద ట్వీట్‌పై పలువురు ప్రముఖులూ స్పందించారు. ఆమె చేసిన ట్వీట్ స్క్రీన్ షాట్‌ను మంచు విష్ణు పోస్ట్ చేస్తూ.. "ఆమెకు ఏమైంది? అసలు ఈ విధంగా ఎలా ఆలోచించగలరు? సైనిక బలగాలను మనమంతా గౌరవించాలి. దేశం పట్ల వారి అసామాన్య సేవలనైనా గుర్తించాలి. కృతజ్ఞతాభావం లేని ఇలాంటి వారిని చూస్తుంటే బాధగా ఉంది" అని ట్వీట్ చేశారు.
"ఈ పోస్ట్ చూస్తుంటే బాధగా ఉంది. ఏ అంశమూ.. సాయుధ దళాల పట్ల మనల్ని కృతజ్ఞత లేనివారిగా మార్చకూడదు" అని అక్షయ్ కుమార్ పేర్కొన్నారు. గల్వాన్ లోయలో ప్రాణాలు కోల్పోయిన వారిని రిచా అవమానించారన్న బాలీవుడ్ నిర్మాత అశోక్ పండిట్ ఆమెపై చర్యలు తీసుకోవాలంటూ జూహు (ముంబయి) పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
జరిగిందేంటంటే..?
'పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకునే విషయంలో ప్రభుత్వం నుంచి వచ్చే ఏ ఆదేశానికైనా సైన్యం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుంది. వారికి (పాక్‌ను ఉద్దేశించి) గట్టి సమాధానం ఇస్తాం' అని నార్తర్న్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది అన్నట్లు ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్‌ను కోట్ చేస్తూ రిచా చద్దా 'Galwan says hi' అంటూ రీట్వీట్ చేశారు.
ఇక్కడ ఆమె ఉద్దేశం ఏంటో తెలియడం లేదు గానీ, ఆమె ట్వీట్‌లో వాడిన గల్వాన్ పదం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఈ క్రమంలో ఆమె.. 'ఎవర్నీ బాధించాలన్నది నా ఉద్దేశం కాదు. కానీ, ఆ మూడు పదాలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే నన్ను క్షమించండి' అంటూ మరో పోస్ట్ పెట్టారు. తన తాత కూడా సైన్యంలో పనిచేశారన్న ఆమె.. చైనాతో యుద్ధంలో దేశం కోసం పోరాడినట్టు తెలిపారు. ఆయన రక్తమే తనలోనూ ప్రవహిస్తోందని చెప్పారు.