Veerasimha Reddy Jai Balayya Song: బాలకృష్ణ సినిమా సంక్రాంతికి విడుదల కావడం కొత్త కాదు. 'వీరసింహారెడ్డి'తో మరోసారి సంక్రాంతి హీరోగా సందడి చేయనున్నారాయన. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం 'వీరసింహారెడ్డి'. బాలకృష్ణ, శ్రుతిహాసన్ జోడీగా నటిస్తున్నారు. వరలక్ష్మి శరత్‌కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. నవీన్ యెర్నేని, వై.రవిశంకర్ నిర్మాతలు. ప్రస్తుతం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరుగుతోంది.
తాజాగా ఈ సినిమా ప్రచార కార్యక్రమాలు షురూ అయ్యాయి. ఈ నెల 25న 'జై బాలయ్య..' అంటూ సాగే తొలి గీతాన్ని విడుదల చేయనున్నారు. ఆ విషయాన్ని చిత్రబృందం బుధవారం వెల్లడించింది. రాజసం నీ ఇంటి పేరు.. అని పేర్కొంటూ ఆకర్షణీయమైన ఓ ప్రచార చిత్రాన్ని విడుదల చేశాయి సినీ వర్గాలు. అందులో బాలకృష్ణ తెల్లటి దుస్తులు ధరించి, ట్రాక్టర్ నడుపుతూ దర్శనమిచ్చారు. 'అఖండ' తర్వాత బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన చిత్రమిది.
జై బాలయ్య అంటూ సాగే ఓ గీతం 'అఖండ'లోనూ వినిపిస్తుంది. ఈ సినిమా కోసం సంగీత దర్శకుడు తమన్ మరోసారి జై బాలయ్య.. అంటూ సాగే మాస్ గీతాన్ని సిద్ధం చేశారు. అది అభిమానులతోపాటు, ఇతర ప్రేక్షకుల్నీ మెప్పించేలా ఉంటుందని సినీ వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి మాటలు: సాయిమాధవ్ బుర్రా, కూర్పు: నవీన్ నూలి, ప్రొడక్షన్ డిజైన్: ఎ.ఎస్.ప్రకాశ్, ఛాయాగ్రహణం: రిషి పంజాబీ.