దశాబ్ద కాలంలో ఎప్పుడూ రానన్ని సినిమాలు గతేడాది తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. అనువాదాలతో కలుపుకుని 287 చిత్రాలు విడుదలయ్యాయి. అందులో విజయాలు తక్కువే కానీ..ప్రేక్షకుడు మాత్రం వినోదాల జల్లులో తడిసి ముద్దయ్యాడు. ఎప్పట్నుంచో ఎదురు చూసిన చిత్రాలు 2022లో ప్రేక్షకుల ముందుకొచ్చాయి. పాన్ ఇండియా చిత్రాల జోరుతో దేశం మొత్తం తెలుగు సినిమా గురించి మాట్లాడుకుంది. 'ఆర్‌ఆర్‌ఆర్' ప్రపంచ స్థాయిలో చర్చని లేవనెత్తింది. సంఖ్య పరంగా..సాంకేతికత పరంగా 2023 కూడా అందుకు దీటుగానే కనిపిస్తోంది.
అగ్ర తారల చిత్రాలు ఈ ఏడాది కూడా వరుస కట్టనున్నాయి. అందులో అంచనాల్ని రేకెత్తించే కలయికల్లో సినిమాలున్నాయి.. పాన్ ఇండియా ఆకర్షణలూ ఉన్నాయి. మరోవైపు పొరుగు పరిశ్రమల నుంచీ చిత్రాలు పోటెత్తే సూచనలు కనిపిస్తున్నాయి. కరోనా భయాలు కూడా తగ్గాయి కాబట్టి..సినిమా నిర్మాణాలు మరింతగా ఊపందుకుని..చిత్రసీమలోకి పెట్టుబడుల ప్రవాహం కొనసాగే అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి. ప్రభాస్‌తో 'సలార్' నిర్మిస్తున్న హోంబళే ఫిలింస్ రానున్న ఐదేళ్ల కాలంలో రూ.3వేల కోట్లు పెట్టుబడులు సినిమా రంగంపై పెట్టనున్నట్టు తెలిపింది. అలాంటి ప్రణాళికలతోనే ఉన్నాయి మరిన్ని నిర్మాణ సంస్థలు. 2023 తెలుగు చిత్రసీమకి మరింత కీలకం కానుంది.
ఒకొక్కటి కాదు.. : అగ్ర కథానాయకుల్లో చాలా మంది ఈమధ్య ఏడాదికొక సినిమాతో సరిపెట్టుకుంటున్నారు. 2023లో మాత్రం ఏడాదికి రెండు సినిమాలతో అలరించనున్న కథానాయకుల జాబితా చాలానే కనిపిస్తోంది. అందులో ప్రభాస్, చిరంజీవి, బాలకృష్ణ, రవితేజ తదితర కథానాయకులు ఉన్నారు. పవన్‌కల్యాణ్ నుంచి కూడా ఈ సంవత్సరం రెండు సినిమాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి.
సంక్రాంతికి 'వీరసింహారెడ్డి'తో సందడి చేయనున్న బాలకృష్ణ, ఇప్పటికే అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమాని పట్టాలెక్కించారు. ఆ చిత్రం కూడా ఈ ఏడాదే విడుదల కానుంది. చిరంజీవి 'వాల్తేరు వీరయ్య' తర్వాత 'భోళాశంకర్' సినిమాతో సందడి చేయనున్నారు. ఆ సినిమా కూడా ఇప్పటికే సింహభాగం చిత్రీకరణని పూర్తి చేసుకుంది. మహేష్‌బాబు - త్రివిక్రమ్ కలయికలో రూపొందుతున్న సినిమాకి కూడా విడుదల తేదీ ఖరారయ్యింది. 'ధమాకా'తో విజయాన్ని అందుకున్న రవితేజ, ఈ ఏడాది 'వాల్తేరు వీరయ్య'తోపాటు 'రావణాసుర', 'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాలతో సందడి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.
ఆరంభం నుంచే..
దేశంలో బలమైన చిత్ర పరిశ్రమల్లో తెలుగు సినిమా ఒకటి. 2020లో మినహా గత దశాబ్దకాలంలో ఏటా 200కిపైగానే సినిమాలు ప్రేక్షకుల ముందుకొచ్చాయి. బాగుందంటే పొరుగు భాషల నుంచి వచ్చే సినిమాల్నీ ఆదరిస్తారు తెలుగు ప్రేక్షకులు. అందుకే ఇతర పరిశ్రమలు సైతం తెలుగు ప్రేక్షకాభిరుచిని మెచ్చి ఇక్కడ విడుదల చేస్తుంటాయి. దాంతో ప్రతీ శుక్రవారం మన బాక్సాఫీస్ దగ్గర పండగ వాతావరణం కనిపిస్తుంటుంది.
2023లోనూ సినిమాలు పోటాపోటీగా విడుదల కాబోతున్నాయి. సంక్రాంతి నుంచే జోరు షురూ కానుంది. ఎప్పట్లాగే పండగకి అగ్ర తారల సినిమాలు, అనువాదాలు, పరిమిత వ్యయంతో రూపొందిన చిన్న సినిమా.. ఇలా పక్కా లెక్కతోనే చిత్రాలు ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. 11, 12, 13, 14వ తేదీల్లో అజిత్ 'తెగింపు', బాలకృష్ణ 'వీరసింహారెడ్డి', విజయ్ 'వారసుడు', చిరంజీవి - రవితేజల 'వాల్తేరు వీరయ్య', యువ కథానాయకుడు సంతోష్ శోభన్ నటించిన 'కళ్యాణం కమనీయం' కూడా ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి.
ఈ చిత్రాలన్నీ కలిపి దాదాపు రూ.600కోట్ల వ్యయంతో రూపొందినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. సంక్రాంతి తర్వాత మరో వారం విరామం అంతే. ఆ వెంటనే మళ్లీ కొత్త సినిమాల జోరు షురూ కానుంది. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని మరి కొన్ని చిత్రాలు విడులదవుతున్నాయి. ఫిబ్రవరి, మార్చిలో విడుదల ఖరారు చేసుకున్న చిత్రాలు చాలానే ఉన్నాయి.
పాన్ ఇండియా ఆకర్షణలెన్నెన్నో..
2022లాగే ఈ సంవత్సరం కూడా పాన్ ఇండియా మాట గట్టిగా వినిపించే అవకాశాలు కనిపిస్తున్నాయి. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటిస్తున్న ‘పుష్ప2’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. అది ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ప్రభాస్ చిత్రాలు 'ఆదిపురుష్', 'సలార్' గురించి దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఆ రెండూ ఈ సంవత్సరంలోనే విడుదలవుతున్నాయి. పవన్‌కల్యాణ్ 'హరి హర వీరమల్లు' కూడా పాన్ ఇండియా చిత్రమే.
వేసవిలో రానున్న ఈ సినిమాతోపాటు, మరొకటి కూడా ఆయన్నుంచి వచ్చే అవకాశాలున్నాయనేది పరిశ్రమ వర్గాల మాట. పవన్‌కల్యాణ్ రాజకీయ వ్యవహారాలపైనే ఆ విషయం ఆధారపడి ఉంటుంది. రామ్‌చరణ్ - శంకర్ కలయికలో రూపొందుతున్న సినిమా కూడా ఇప్పటికే చాలా వరకు చిత్రీకరణని పూర్తి చేసుకుంది. ఆ సినిమా కూడా ఈ ఏడాదే ప్రేక్షకుల ముందుకొస్తుందని అంచనా. ఎన్టీఆర్ - కొరటాల కలయికలో సినిమా కూడా ఈ ఏడాది వస్తుందని అంచనాలు ఉన్నప్పటికీ చిత్రబృందం దానిపై ఇటీవలే స్పష్టత ఇచ్చింది. 2024 వేసవిలో ఆ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.
అగ్ర తారలే కాదు, యువ కథానాయకుల చిత్రాలూ ఈసారి పోటాపోటీగా విడుదల కానున్నాయి. కల్యాణ్‌రామ్, నాని, నాగచైతన్య, రామ్‌ల చిత్రాలు శరవేగంగా చిత్రీకరణని పూర్తి చేసుకుంటున్నాయి. గతేడాది ఆరంభంలో ఒమిక్రాన్ భయాలతోపాటు, చిత్రసీమ సమ్మె సమస్యలు వెంటాడినా సినిమాల ఉధృతి పతాకస్థాయిలో కొనసాగింది. ఈసారి అలాంటి అవాంతరాలు లేకపోతే ఆ సంఖ్య మరింత పెరగొచ్చనేది వ్యాపార వర్గాల అంచనా.