టాలీవుడ్ యంగ్ హీరో సంతోశ్ శోభన్, మాళవికా నాయర్ జంటగా నటించిన రీసెంట్ ఫీల్‌గుడ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ 'అన్నీ మంచి శకునములే'. 'అలా మొదలైంది', 'ఓ బేబీ' లాంటి సూపర్ హిట్ మూవీస్‌ను ఇండస్ట్రీకి ఇచ్చిన నందిని రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. ఇక ఈ సినిమా వేసవి కానుకగా మే 18న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ ఓ ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
"ఈ కథను నేను ఎప్పుడో రాసుకున్నాను. మొదట దీన్ని విజయ్ దేవరకొండతో చేయాలనుకున్నాను. తను కూడా ఈ స్టోరీపై ఆసక్తి చూపించాడు. కానీ ఆ తర్వాత విజయ్ ఇమేజ్ మారింది. దీంతో ఇలాంటి సాఫ్ట్ రోల్ అతడికి కరెక్ట్ కాదని నిర్మాత స్వప్న దత్, నేనూ ఫీలయ్యాం. అదే విషయాన్ని అతడికి కూడా చెప్పాం. ఆ తర్వాత నేను 'ఓ బేబీ' సినిమాను తెరకెక్కించాను. అది అయ్యాక రెండేళ్లు కొవిడ్ కారణంగా లాక్‌డౌన్‌లో ఉండిపోయాం. అయితే ఈ ప్రాజెక్ట్ మొదలుపెట్టి నటీనటుల కోసం వెతుకుతున్నప్పుడు స్వప్న సడెన్‌గా.. సంతోశ్ పేరు చెప్పింది. ఇక వెంటనే స్క్రీన్ టెస్ట్ చేశాం. ఈ రోల్‌కు సంతోశ్ సరిగ్గా సెట్ అయ్యాడు. సంతోశ్ మాత్రమే కాదు.. ఈసినిమాలో ప్రతి ఒక్కరూ ఆయా పాత్రలకు కరెక్ట్‌గా సెట్ అయ్యారు. ఇక నా నెక్స్ట్ ప్రాజెక్ట్ సిద్ధు జొన్నలగడ్డతో చేస్తున్నాను. సిద్ధు నాకు 'అలా మొదలైంది' సినిమా అప్పటి నుంచే తెలుసు. మూడు నెలల క్రితమే మా సినిమా ఓకే అయ్యింది. మా ఇద్దరి కాంబో మ్యాడ్ రోలర్ కోస్టర్ రైడర్‌లా ఉంటుంది."
" ఇక అల్లు అర్జున్‌తో నాకు ఎన్నో ఏళ్ల నుంచి మంచి స్నేహం ఉంది. నేను రాసే కథలను బన్నీకి షేర్ చేస్తుంటాను. ఎప్పటి నుంచో ఆయనతో సినిమా చేయాలని నాకు ఆశగా ఉంది. కానీ కుదరలేదు. ఇప్పుడు బన్నీ పెద్ద స్టార్ అయ్యారు. ఆయన ఇమేజ్‌కు తగ్గట్టుగా మంచి కథ దొరికితే తప్పకుండా చేస్తాను. ఇక, సమంత నాకు మంచి ఫ్రెండ్. సామ్‌కు ఏదీ అంత ఈజీగా రాలేదు. ఆమె ఎంత కష్టపడుతుంతో నాకు బాగా తెలుసు. హార్డ్‌వర్క్ విషయంలో సామ్-బన్నీ ఒక్కటే. ఆ ఇద్దరూ అలా కష్టపడటం ఇప్పుడు ఈ స్థాయికి రాగలిగారు. లక్ వల్ల కాదు" అని నందినిరెడ్డి వివరించారు.
ఈ సినిమాను స్వప్న సినిమా బ్యానర్‌పై ప్రియాంక దత్ తెరకెక్కించారు. ఇందులో సంతోశ్ శోభన్, మాలవిక నాయర్‌తో పాటు గౌతమి, రావు రమేశ్, రాజేంద్ర ప్రసాద్, నరేశ్, షావుకారు జానకి, వాసుకి, రమ్య సుబ్రమణియన్, వెన్నెల కిషోర్, అంజు ఆల్వా నాయక్, అశ్విన్ కుమార్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాకు మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందించారు.