ప్రతిష్ఠాత్మక చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'లో రామ్‌చరణ్, ఎన్టీఆర్ తమ నటనతో అదరగొట్టేశారని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అన్నారు. 'ఆర్‌ఆర్‌ఆర్'లో తారక్ పాత్ర చిన్నగా ఉందంటూ ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందనలపై పరుచూరి స్పందించారు. పాత్ర నిడివి ఎంత సేపు ఉందనేది కాదని, అది ప్రేక్షకుల్లో ఎలాంటి ప్రభావాన్ని సృష్టించిందనేది చూడాలని ఆయన అన్నారు.
"'ఆర్‌ఆర్‌ఆర్'లో రామ్‌తో పోలిస్తే భీమ్ పాత్ర నిడివి తక్కువ ఉందని దానిపై స్పందించమని అందరూ కామెంట్స్ పెడుతున్నారు. వాళ్లందరికీ నేను చెప్పేది ఒక్కటే.. పాత్ర నిడివి ఎంత ఉందనేది కాదు.. ప్రేక్షకులపై ఎంత ప్రభావాన్ని చూపింది అనేది చూడాలి. 'పెదరాయుడు'లో రజనీకాంత్ రోల్ అతి తక్కువ సమయమే కనిపించినప్పటికీ ఆ సినిమా ఆడినన్ని రోజులు రజనీకాంత్ రోల్ మనకు గుర్తుకువస్తూనే ఉంటుంది."
"నిజం చెప్పాలంటే రామ్ పాత్ర కాస్త ఎక్కువగా ఉన్నప్పటికీ రచయిత, దర్శకుడు ఆ రెండు పాత్రలను రెండు కళ్లలా చూశారనిపించింది. వారిద్దరి పరిచయ సన్నివేశాలు, ఫైట్ సీక్వెన్స్‌లను అద్భుతంగా రూపొందించారు. ఆ సన్నివేశాల్లో ఈ హీరోల నటన చూస్తుంటే కన్నుల పండుగగా అనిపిస్తుంది పాత్రలు రెండింటికి వీరిద్దరూ అద్భుతంగా న్యాయం చేశారు. ఈ సినిమాలో నేను రామ్‌చరణ్, ఎన్టీఆర్‌లను చూడలేదు. కేవలం కొమురంభీమ్, అల్లూరి సీతారామరాజులనే చూశా. ఇక, సినిమా ఆరంభమైనప్పటి నుంచి రామ్‌చరణ్ ఒక ఆశయం కోసం పనిచేస్తున్నాడనే విషయం తెలియనివ్వకుండా చూపించారు. హావభావాలు పలికించడం, నటనా పరంగా ఆయన ఏ కాస్త తడబడినా మొత్తం సినిమాపై ప్రభావం చూపించేది.. ఆయుధాలు ఎత్తుకెళ్లడానికే తాను బ్రిటిషర్ల దగ్గర పనిచేస్తున్నాడనే విషయాన్ని తెలియనివ్వకుండా అతను అద్భుతంగా నటించాడు" అని పరుచూరి వివరించారు.