Rc 16 Updates : తీసిన సినిమాని ఇతర భాషల్లో విడుదల చేయడం వేరు... ముందు నుంచే పాన్ ఇండియా మార్కెట్ లక్ష్యంగా సినిమా చేయడం వేరు. తెలుగు చిత్రసీమలో ఇలా రెండు రకాల సినిమాలు రూపొందుతుంటాయి. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో అలరించి, ఆ మార్కెట్‌ని రుచి చూసిన కథానాయకుల కొత్త చిత్రాలు తప్పనిసరిగా అందుకు తగ్గట్టుగానే తెరకెక్కుతుంటాయి.
భారీ కాన్వాస్, భారీ బడ్జెట్‌తోనే ఆ సినిమాలు పట్టాలెక్కుతుంటాయి. రామ్‌చరణ్ ప్రస్తుతం చేస్తున్న సినిమాతోపాటు, తదుపరి చిత్రం కూడా అదే తరహాలోనే రూపొందనున్నట్టు సమాచారం. రామ్‌చరణ్ 16వ చిత్రం దాదాపు ఖాయమైనట్టే. మొన్నటివరకు ఆ ప్రాజెక్ట్ కోసం కథలు విన్న ఆయన... 'ఉప్పెన' ఫేమ్ బుచ్చిబాబు సానా చెప్పిన కథకి పచ్చజెండా ఊపినట్టు తెలుస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో, భారీ బడ్జెట్‌తోనే ఆ సినిమా రూపొందనున్నట్టు సమాచారం. ప్రస్తుతం రామ్‌చరణ్ న్యూజిలాండ్‌లో శంకర్ దర్శకత్వం వహిస్తున్న సినిమా చిత్రీకరణతో బిజీగా ఉన్నారు.
sharwanand new movie: మరో కొత్త సినిమాలో... కొత్త జంట సందడి చేయబోతోంది. యువ కథానాయకుడు శర్వానంద్‌కి జోడీగా కృతిశెట్టి నటించనుంది. 'ఒకే ఒక జీవితం'తో విజయాన్ని అందుకున్న శర్వానంద్ తదుపరి శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో సినిమా చేయడానికి అంగీకారం తెలిపారు. 'హీరో' తర్వాత శ్రీరామ్ ఆదిత్య చేస్తున్న చిత్రమిది. ఈ కలయికలో రూపొందనున్న సినిమాలోనే కథానాయికగా కృతిశెట్టిని ఎంపిక చేసినట్టు తెలిసింది. హాస్యం, భావోద్వేగాల మేళవింపుతో ఈ చిత్రం రూపొందుతున్నట్టు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది.
Tapsee new movie : దక్షిణాదిలో అలరించి ఆ తర్వాత ఉత్తరాదిలో మంచి పేరు తెచ్చుకొని వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకుంటున్న కథానాయిక తాప్సి. ఈ తార చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. తొలి చిత్రంగా 'బ్లర్'ని తెరకెక్కిస్తోంది. స్పానిష్ చిత్రం 'జులియాస్ ఐస్' ఆధారంగా ఇది రూపొందింది. అక్కాచెల్లెళ్ల నేపథ్యంలో సాగే థ్రిల్లర్ చిత్రమిది.
ఈ సినిమాని థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. జీ5 ద్వారా వచ్చే నెల 6న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో తాప్సి ద్విపాత్రాభినయం చేయడంతో పాటు అంధురాలిగా నటిస్తోంది. 'బద్లా' తర్వాత ఆమె నటిస్తోన్న రెండో స్పానిష్ రీమేక్ చిత్రమిది. అజయ్ భల్ ఈ చిత్రానికి దర్శకత్వం వస్తున్నారు.