'టైటానిక్' అనగానే ఓ మరపురాని దృశ్యకావ్యం కళ్ల ముందు కదులుతుంది. ప్రపంచాన్ని కుదిపేసిన ఓ పెను విషాదం గుర్తుకొస్తుంది. 1912లో జరిగిన ఈ ఓడ ప్రమాదాన్ని వెండితెరపై ఆవిష్కరిస్తూనే, దానికి జతగా ఓ సున్నితమైన ప్రేమ కథనూ ప్రేక్షకులకు పరిచయం చేశాడు జేమ్స్ కామెరూన్. ఆయనే స్వయంగా రచించి, నిర్మించి, దర్శకత్వం వహించిన ఈ సినిమా... 1997లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
భారీ వసూళ్లు...
లియొనార్డో డికాప్రియో, కేట్ విన్స్‌లెట్ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమా కోసం అప్పట్లోనే అత్యధికంగా 200 మిలియన్ డాలర్లు ఖర్చు చేశారు. ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో విడుదలైన ఈ చిత్రం... 2.187 బిలియన్ డాలర్లను కొల్లగొట్టింది. ఈ సినిమాని తొలిసారిగా 1997 నవంబర్ 1న టోక్యోలోని అంతర్జాతీయ చిత్రోత్సవంలో ప్రదర్శించారు. తర్వాత డిసెంబర్ 19న అమెరికాలో విడుదల చేశారు.
ఏమైంది..?
1912 ఏప్రిల్ 15న అట్లాంటిక్ సముద్రంలో 2,224 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్న టైటానిక్ ఓడ... ఓ హిమఖండాన్ని ఢీకొని మునిగిపోయింది. ఈ ప్రమాదంలో 1500 మంది చనిపోయారు. ఈ ఘటన యావత్ ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది. అయితే ఆ యదార్థగాథను సినిమా రూపంలో చిత్రీకరించేందుకు రెండేళ్ల పాటు పరిశోధన చేశాడు కామెరూన్.
ఒరిజినల్ కంటే ఎక్కువ..
నిజమైన పాత్రలను, కొన్ని కాల్పనిక పాత్రలను కలిపి ఓ ఉద్వేగభరితమైన చిత్రంగా టైటానిక్‌ను రూపొందించాడు జేమ్స్. సముద్రంలో టైటానిక్ ఓడ మునిగిపోయిన ప్రాంతానికి కామెరాన్ ఎన్నో సార్లు డైవ్ చేసి వెళ్లి మరీ పరిశోధన చేశాడట. నిజమైన టైటానిక్‌లో ప్రయాణికులు గడిపిన సమయం కంటే... మునిగిపోయిన పడవలో కామెరూన్ ఎక్కువ సమయం గడపడం విశేషం. అందుకే అద్భుతమైన దృశ్యకావ్యానికి, అతడి శ్రమకు 11 ఆస్కార్ అవార్డులు వచ్చాయి.
నిజమైన 'టైటానిక్' ఓడను నిర్మించేందుకు 144.5 మిలియన్లు ఖర్చుచేయగా... సినిమాను తెరకెక్కించేందుకు దాని కన్నా ఎక్కువ బడ్జెట్ అవడం విశేషం.