తన పిల్లల కస్టడీ కోసం భారత్‌కు చెందిన ఓ మాతృమూర్తి ఏకంగా నార్వే గవర్నమెంట్‌తో పోరాడేందకు సిద్ధపడింది. ఈ పోరాటం.. నార్వే, భారత్‌లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే ఇదంతా జరిగి దశాబ్ద కాలం అయ్యింది. ఇప్పుడెందుకు ఈ ప్రస్తావన వచ్చిందంటే.. అప్పడు ఆ తల్లి జరిపిన పోరాటం బాలీవుడ్లో సినిమాగా రాబోతోంది. 'మిసెస్ ఛటర్జీ వర్సెస్ నార్వే'గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో తల్లి పాత్రలో బాలీవుడ్ నటి రాణీ ముఖర్జీ నటించింది. మార్చి 17న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా వెనకున్న అసలు కథ గురించి ఓ సారి తెలుసుకుందాం.
భర్త ఉద్యోగం కోసం పశ్చిమ్ బంగాకు చెందిన ఓ భారతీయ జంట నార్వేకు వెళ్లారు. వారే సాగరికా అనురూప్ భట్టాచార్య. వీరికి ఇద్దరు సంతానం. అందులో పెద్దబ్బాయికి ఆటిజం వ్యాధి లక్షణాలు కనిపించాయి. భర్తకు ఉద్యోగంతోనే సరిపోయేది. ఈ క్రమంలో రెండో సారి తల్లి కావడంతో పాటు ఇంటిని ఒక్కతే చూసుకోవడం వల్ల అలసిపోయేది. అంతే కాకుండా తన మొదటి సంతానాన్ని చూసుకోవడం కూడా ఆమెకు కష్టతరంగా మారింది.
మరోవైపు నార్వేలో పిల్లలకు సంబంధించిన చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. ఆ దేశంలోని ప్రతి ఒక్కరు పద్ధతులు, ఆచారాలతో సంబంధం లేకుండా వాటిని కచ్చితంగా పాటించాల్సిందే. పిల్లలపై చేయి చేసుకున్న, చేత్తో తినిపించినా, పిల్లలకు, తల్లిదండ్రులకు వేర్వేరు పడకలు లేకపోయినా అక్కడ ఇలాంటి విషయాలను తీవ్రంగా పరిగణిస్తారు. ఇలాంటి చట్టాలే సాగరికా జీవితంలో మరిన్ని కష్టాలు తెచ్చిపెట్టాయి. ఆమె పిల్లాడిని సరిగ్గా చూసుకోవట్లేదని ఎవరో నార్వే అధికారులకు సమాచారం అందించారు. దీంతో అక్కడి అధికారులు సాగరిక ఇంటిని పరిశీలించారు. అప్పటికీ ఆమె నిండు గర్భిణిగా ఉండటం వల్ల ఈ విషయాన్ని అక్కడితో వదిలేసి వెళ్లిపోయారు. అయితే ఆ బాబు చదువుకునే ప్లే స్కూల్.. చిన్నారితో పాటు తన తల్లిదండ్రుల గురించి ఎప్పటికప్పుడు అధికారులకు సమాచారం అందిస్తూనే ఉండేది. ఆమె దిన చర్య సరిగా లేదంటూ కౌన్సిలింగ్‌కు కూడా పిలిచింది.
ఇలా కొద్ది రోజులు గమనించిన అధికారులు ఇక ఆ చిన్నారులను వీరు సరిగా పెంచడం లేదని, తల్లితో పిల్లలకు భావోద్వేగ అనుబంధం లేదని.. చిన్నారులకు 18 ఏళ్లు నిండేవరకు వారు సంరక్షణా కేంద్రంలో పెరుగుతారని.. నార్వే అధికారులు పిల్లలను తల్లిదండ్రులకు దూరం చేశారు.
2011లో జరిగిన ఈ ఘటన ఆ తల్లిదండ్రులను ఒక్కసారిగా కుదిపేసింది. ఈ ఊహించని పరిణామంతో వారిద్దరు ఒక్కసారిగా అవాక్కయ్యారు. తమ పిల్లలను పెంచుకోలేని దుస్థితిని తలుచుకుని కుమిలిపోయారు. అయితే ఈ విషయంలో కోర్టుకెక్కిన తల్లిదండ్రులకు అక్కడ కూడా నిరాశే ఎదురైంది. ఈ క్రమంలో పిల్లల పెంపకం విషయంలో సంరక్షణా కేంద్రానికే అనుకూల తీర్పు వచ్చింది. అంతే కాకుండా పిల్లలను చూసేందుకు ఆ తల్లిదండ్రులకు ఏడాదికి మూడు సార్లే అనుమతినిచ్చింది నార్వే ప్రభుత్వం. అప్పటికే సంచలనమైన విషయం నార్వేతో పాటు భారత్‌లో వార్తాలకెక్కింది.
ఇదే సమయంలో సాగరిక, అనురూప్ మధ్య దూరం పెరిగి వారి బంధం కూడా బీటలు వారింది. 2012లో కోర్టు.. పిల్లల బంధువుల్లో ఒకరికి ఆ చిన్నారుల కస్టడీని అప్పజెప్పింది. అప్పుడు భారత్ ఈ విషయంలో జోక్యం చేసుకోవడం వల్ల పిల్లలను భారత్‌కు పంపించేందుకు నార్వే కోర్టు అంగీకరించింది. కానీ ఆ చిన్నారులు బంధువు దగ్గరే పెరగాలంటూ షరతు విధించింది. అలా చిన్నారులు ఎట్టకేలకు భారత్‌కు చేరుకున్నారు. ఇక తన పిల్లలు తనకు కావాలంటూ సాగరికా పశ్చిమ బంగాల్‌కు చేరుకుని కోల్‌కతా కోర్టు మెట్లెక్కింది. అలా తన పోరాటాన్ని కొనసాగించింది. 2013 జనవరిలో కొల్కతా కోర్టు ఇచ్చిన తీర్పు సాగరికకు ఊరట కలిగించింది. ఆఖరికి తల్లి చెంతకు పిల్లలు చేరుకున్నారు. ఆ సమయంలో ఆమె తీవ్ర ఉద్వేగానికి గురైంది. ఎంతో కాలంగా తన బిడ్డలకు దూరంగా ఉన్న సాగరిక.. తన సంతోషాన్ని పట్టలేకపోయింది.
ఇక సినిమా విషయానికి వస్తే.. ఆషిమా చిబ్బర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రాణీ ముఖర్జీతో పాటు అనిర్బన్ భట్టాచార్య, జిమ్ సర్బా, నీనా గుప్తాలు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫిబ్రవరి 23న రిలీజైన ఈ ట్రైలర్ ఎందరినో భావోద్వేగానికి గురి చేసింది. ట్రైలర్ చూసిన పలువురు బాలీవుడ్ ప్రముఖుల ఈ సినిమాను ప్రశంసిస్తున్నారు.