సూపర్‌స్టార్ రజనీకాంత్.. నటనలోనే కాదు వ్యక్తిత్వంలోనూ ఆయనను చూసి ఎంతోమంది స్ఫూర్తి పొందుతుంటారు. అయితే.. రజనీ మాత్రం తన భార్య తనను ఎంతో మార్చిందని.. ఆమెకు ఎప్పటికీ రుణపడి ఉంటానని అంటుంటారు. ఇప్పటికే చాలా సందర్భాల్లో తన భార్య లత గురించి చాలా విషయాలు చెప్పారు. తాజాగా మరోసారి ఆమెకు కృతజ్ఞతలు చెప్పారు. ఇటీవల తమిళనాడులో జరిగిన ఓ కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్న ఆయన వేదికపై మాట్లాడుతూ తన భార్య వల్లే క్రమశిక్షణ నేర్చుకున్నానని అన్నారు.
"నా భార్య లతను నాకు పరిచయం చేసిన మహేంద్రన్‌కు నేను రుణపడి ఉంటాను. బస్సు కండక్టర్‌గా చేస్తున్నప్పుడు రోజూ మద్యం తాగేవాడిని. రోజుకు ఎన్ని సిగరెట్లు తాగేవాడినో లెక్క ఉండేది కాదు. అలాగే రోజూ మాంసాహారం తీసుకునేవాడిని. కానీ, ఈ మూడు మంచి అలవాట్లు కాదు. వీటికి బానిసలైన వాళ్లు కొంతకాలం తర్వాత ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపలేరన్నది నా అభిప్రాయం. నా భార్య లత తన ప్రేమతో నన్ను ఎంతో మార్చింది. ఆమె వల్లే ఇప్పుడు నేను క్రమశిక్షణతో జీవితాన్ని గడుపుతున్నాను" అని అన్నారు. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం రజనీకాంత్ నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో 'జైలర్' సినిమాలో నటిస్తున్నారు. రజనీ 169వ సినిమాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ హీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఇదీ చూడండి: టాలీవుడ్లో 'వీరయ్య'.. బాలీవుడ్లో 'పఠాన్'.. బాక్సాఫీస్ షేక్!