Pushpa 2 Movie Shooting: 'పుష్ప.. ది రైజ్' సాధించిన విజయం.. దాని కొనసాగింపు చిత్రం 'పుష్ప ది రూల్' స్థాయిని మరింతగా పెంచింది. ఈసారి మరిన్ని హంగులతో రూపొందించేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. అందులో భాగంగానే పూర్వ నిర్మాణ పనుల్ని పక్కాగా సమయం తీసుకుని చేస్తున్నారు. హాలీవుడ్ చిత్రాల తరహాలో స్టోరీ బోర్డ్‌ను సిద్ధం చేసుకుని సినిమాని పట్టాలెక్కిస్తున్నట్టు సమాచారం.
అందుకే పూర్వ నిర్మాణ పనుల కోసం ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. లొకేషన్లు, విజువల్ ఎఫెక్ట్స్, ఇతరత్రా సాంకేతికత విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. దీపావళి పండగ పూర్తయిన తర్వాతే సినిమాని పట్టాలెక్కించనున్నట్టు సమాచారం. అల్లు అర్జున్, రష్మిక జంటగా నటిస్తున్న ఈ చిత్రాన్ని సుకుమార్ తెరకెక్కిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
మలయాళం రీమేక్‌తో మోహన్‌బాబు
ఈ ఏడాది ఆరంభంలో 'సన్నాఫ్ ఇండియా'చిత్రంతో ప్రేక్షకుల్ని పలకరించారు నటుడు మోహన్‌బాబు. ఇప్పుడు తన కూతురు మంచు లక్ష్మీతో కలిసి 'అగ్ని నక్షత్రం' అనే సినిమా చేస్తున్నారు. కాగా, ఇప్పుడాయన కోసం ఓ రీమేక్ కథ సిద్ధమైంది. అదే 'ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25'. మలయాళంలో విజయవంతమైన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో పునర్నిర్మించేందుకు సిద్ధమయ్యారు నటుడు, నిర్మాత మంచు విష్ణు. ఈ విషయాన్ని తాజాగా ఆయనే స్వయంగా వెల్లడించారు.
''ఆండ్రాయిడ్ కుంజప్పన్' తెలుగు రీమేక్‌ను వచ్చే ఏడాది జనవరి నాటికి సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నాం. ప్రధాన పాత్రను నాన్న మోహన్‌బాబు పోషిస్తారు. ఆయన తనయుడి పాత్ర కోసం ఓ ప్రముఖ నటుణ్ని ఎంపిక చేయనున్నాం. ప్రస్తుతం తెలుగు వాతావరణానికి తగ్గట్లుగా కథలో మార్పులు చేస్తున్నాం. మరిన్ని వివరాలు త్వరలో తెలియజేస్తామ''ని చెప్పారు విష్ణు. తండ్రీ కొడుకుల అనుబంధం నేపథ్యంలో సాగే కథ ఇది. సైన్స్ ఫిక్షన్ అంశాలతో మిళితమై ఉంటుంది. మాతృకలో సూరజ్ తేలక్కడ్, సౌబిన్ షాహిర్, సూరజ్ వెంజరమూడు ప్రధాన పాత్రల్లో నటించారు. రతీష్ బాలకృష్ణన్ పొదువాల్ తెరకెక్కించారు.
ఇవీ చదవండి: 'ఊహించిన దానికంటే ఎక్కువ వసూళ్లు.. ఒక్క అమెరికాలోనే రెండు మిలియన్లు!'