Adipurush trailer telugu : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ రాముడిగా- హీరోయిన్ కృతి సనన్ సీతగా నటించిన ఇతిహాసగాథ చిత్రం 'ఆదిపురుష్'. బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని.. భూషణ్ కుమార్ టీ సిరీస్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందించారు. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. వరల్డ్ వైడ్‌గా ఎన్నో భాషల్లో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ఎన్నో వివాదాలను ఎదుర్కొన్నాయి. విజువల్ ట్రీట్ కూడా బాలేదని ఫ్యాన్స్ నిరాశ వ్యక్తం చేశారు. దీంతో మూవీటీమ్ మరింత సమయం తీసుకుని.. వీఎఫ్‌ఎక్స్‌ను మరింత నాణ్యతతో ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసేలా విజువల్స్‌ను తీర్చిదిద్దుతోంది.
అయితే టీజర్‌తో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న మూవీ మేకర్స్ ట్రైలర్‌తో ఆకట్టుకుంటారా? అనేది సినీ అభిమానుల్లో మిలియన్ డాలర్ల ప్రశ్నగా మెదులుతూ వచ్చింది. అయితే గత కొద్దిరోజులుగా ఈ సినిమాకు పాజిటివ్ వైబ్స్ వచ్చాయి. రామనవమి పోస్టర్, హనుమంతుడి పోస్టర్, జై శ్రీరామ్ సాంగ్.. ఇలా కొన్ని నెగెటివిటీని కాస్త దూరం చేస్తూ వచ్చాయి. అయితే ఇవ్వనీ కాస్త పాజిటివీటినీ తీసుకొచ్చినప్పటికీ.. అందరీ ఆసక్తి ట్రైలర్‌పైనే నెలకొని ఉంది. ఈ క్రమంలోనే తాజాగా మూవీటీమ్.. కాస్త గ్యాప్ తీసుకుని ఆ ట్రైలర్‌ను భారీ స్థాయిలో రిలీజ్ చేసింది. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో విడుదలైంది. విజువల్ వండర్‌గా రూపొందిన ఈ ప్రచార చిత్రం ఆద్యంతం ఆకట్టుకునేలా ఉంది. రాముడు ఆగమనంతో ప్రారంభమైన ఈ ప్రచార చిత్రంలో సీతను రావణుడు అపహరించడం, ఆయోధ్య పరిచయం, హనుమాన్ పోరాటం, సంజీవని పర్వతాన్ని హనుమంతుడు పెకిలించడం, లంకను తోకతో అంటించడం, వానర సైన్యం.. సముద్రంలో బండరాళ్లను వేసి లంకకు దారి ఏర్పరచడం, చివరికి రామ-రావణ యుద్ధం.. వంటి ఎన్నో ముఖ్యమైన ఘట్టాలను ట్రైలర్‌లో చూపించారు.
హైలైట్‌గా జైశ్రీరామ్.. "ఆయన మనిషిగా పుట్టి భగవంతుడైన మహనీయుడు. ఆయన జీవితం ధర్మానికి, సన్మార్గానికి నిదర్శనం. ఆయన నామం రాఘవ. ఆయన ధర్మం.. అధర్మానికి ఉన్న అహంకారాన్ని అంతం చేసింది. ఇది ఆ రఘనందనుడిని గాధ. యుగయగాల్లోనూ సజీవం జాగృతం. నా రాఘవుడి కథే రామాయణం" అంటూ హనుమంతుడు చెప్పే సంభాషణతో ప్రారంభమైన ఈ ప్రచార చిత్రంలోని ప్రతి సన్నివేశం ఓ విజువల్ వండర్‌గా రూపొందింది. 'నా ప్రాణమే జానకిలో ఉంది. కానీ నా ప్రాణాల కన్నా మర్యాదే అధిక ప్రియమైనది', 'మనం జన్మతో కాదు. చేసే కర్మతో చిన్నా పెద్దా అవుతాం', 'నాకోసం పోరాడొద్దు, వేల సంవత్సరాల తర్వాత తల్లులు మీ వీరగాథలు చెబుతూ పిల్లల్ని పెంచాలి. ఆరోజు కోసం పోరాడండి.. పోరాడతారా? అయితే దూకండి ముందుకు.. అహంకారం రొమ్ము చీల్చి ఎగురుతున్న విజయ ధ్వజాన్ని పాతండి' అంటూ ప్రభాస్ చెప్పిన డైలాగ్స్ ఆకట్టుకుంటున్నాయి. 'నీలో ఉన్న శక్తిని గుర్తించు భజరంగ్. నువ్వు చేసే పనిని ఇతరులు ఎవ్వరూ చేయలేరు' అంటూ సాగే హనుమాన్ సీన్స్ అదిరిపోయాయి. 'రాఘవ నన్ను పొందడానికి శివధనస్సును విరిచారు. ఇప్పుడు రావణుడి గర్వాన్ని విరిచేయాలి' అని జానకి చెప్పడం ఆకట్టుకుంది. మొత్తంగా 'జై శ్రీరామ్' అంటూ సాగే బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ హైలైట్‌గా నిలిచింది.
ముందుగానే థియేటర్లలో రిలీజ్.. ఇప్పటికే ఈ ట్రైలర్‌ను దర్శక, నిర్మాతలు రెండు తెలుగు రాష్ట్రాల్లో కొన్ని థియేటర్లను ఎంపిక చేసి.. మీడియా, పలువురు అభిమానుల కోసం సోమవారం విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఆ ఈవెంట్‌కు ప్రభాస్‌తో పాటు హీరోయిన్ కృతిసనన్, దర్శకుడు ఓం రౌత్ హాజరై సందడి చేశారు. ఇకపోతే ఈ ప్రచార చిత్రం బాగుందంటూ.. ప్రభాస్ ఫ్యాన్స్ సోషల్ మీడియా వేదికగా విపరీతంగా పోస్ట్‌లు పెడుతున్నారు. దానికి సంబంధించిన ఫొటోలు,వీడియోలు ప్రస్తతం నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నాయి.
కాగా, రామాయణాన్ని ఆధారంగా చేసుకుని తెరకెక్కిన ఈ చిత్రాన్ని జూన్ 16న ప్రపంచవ్యాప్తంగా సినిమాను విడుదల చేయనున్నారు. 3డీ వెర్షన్‌లోనూ ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ నేపథ్యంలో తిరుపతి వేదికగా ప్రీరిలీజ్ వేడుక నిర్వహించనున్నారని ప్రచారం సాగుతోంది. దీనిపై మూవీటీమ్ అధికారికంగా స్పందించాల్సి ఉంది. భూషణ్‌కుమార్, కృష్ణకుమార్, ఓంరౌత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
ఇదీ చూడండి: హైదరాబాద్‌లో మరో లగ్జరీ హౌస్ కొన్న సమంత!.. ఎన్ని కోట్లో?