పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ హీరోగా క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రం హరిహర వీరమల్లు . 17వ శతాబ్దంనాటి చారిత్రక కథనంతో తెరకెక్కనున్న ఈ భారీ బడ్జెట్ పాన్ ఇండియా యాక్షన్ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. నిధి అగర్వాల్, నర్గీస్ ఫక్రీ , అర్జున్‌రామ్‌పాల్ ఈ చిత్రంలో ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఎంఎం కీరవాణి సంగీతమందిస్తున్నారు. ప్రఖ్యాత హాలీవుడ్ సాంకేతిక నిపుణుడు బెన్‌లాక్ ఈ చిత్రానికి వీఎఫ్ఎక్స్ హంగులను సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్‌లు, ప్రచారచిత్రాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. ప్రస్తుతం ఈ మూవీ రామోజీ ఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్లో చిత్రీకరణ జరుపుకుంటోంది. అయితే ఆ చిత్రం అనుకున్న సమయానికి కన్నా కొన్నిరోజులు ఆలస్యంగా ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తామని చిత్ర బృందం పరోక్షంగా వెల్లడించింది. ఈ మేరకు నిర్మాణ సంస్థ మెగా సూర్య ప్రొడక్షన్స్ ఓ లేఖ విడుదల చేసింది.
"చారిత్రాత్మక ప్రాముఖ్యత కలిగిన నాణ్యమైన చిత్రాన్ని రూపొందించడం కాలానికి పరీక్షగా నిలుస్తుంది. సూక్ష్మమైన వివరాలు, పరిశోధన, వందలాది తారగణం, సిబ్బంది అపారమైన కృషి అవసరమవుతుంది. అక్టోబర్ చివరి వారం నుంచి షెడ్యూల్ ప్రకారం రామోజీఫిల్మ్ సిటీలో వేసిన భారీ సెట్ లో చిత్రీకరణ శరవేగంగా సాగుతోంది. పవన్ కల్యాణ్‌తో పాటు 900 మంది నటీనటులు, సిబ్బంది చిత్రీకరణ పాల్గొంటున్నారు. హరిహర వీరమల్లు ఒక మైలురాయి చిత్రం అవుతుందని, ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులంతా సంబరాలు జరుపుకుంటారనే మేము చాలా నమ్మకంగా ఉన్నాం. వెండితెరపై అద్భుతాన్ని సృష్టించడానికి మేము చేస్తున్న గొప్ప ప్రయత్నంలో ముందుకు సాగడానికి మీ అందరి ప్రేమ, మద్దతు మాకు ఇలాగే నిరంతరం అందిస్తారని కోరుకుంటున్నాం" అని లేఖలో పేర్కొంది.
ఇదీ చూడండి: సూపర్ స్టార్ కృష్ణ మరణం తర్వాత తొలిసారిగా మహేశ్ ఎమోషనల్ పోస్ట్