Movies Releasing This Week: వేసవి సినిమాల సందడి ముగింపు దశకు వచ్చేసింది. స్కూళ్లు, కాలేజ్‌లు తెరవడం వల్ల బాక్సాఫీస్ వద్ద కాస్త సందడి తగ్గింది. ఇప్పటికే భారీ చిత్రాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయగా, వాటి కారణంగా వాయిదా పడుతూ వచ్చిన చిన్న చిత్రాలు ఇప్పుడు వెండితెరకు క్యూ కట్టాయి. మరి ఈ వారం థియేటర్‌తో పాటు, ఇటు ఓటీటీలోనూ వచ్చే చిత్రాలేవో చూసేద్దామా!
కొండా.. గుండెల నిండా..: నిజ జీవిత కథల్ని తెరకెక్కించడంలో దర్శకుడు రామ్ గోపాల్ వర్మది అందెవేసిన చేయి. ఇలా ఆయన నుంచి వచ్చిన 'రక్తచరిత్ర', 'వీరప్పన్', 'వంగవీటి' వంటివి సినీప్రియుల్ని మెప్పించాయి. ఇప్పుడాయన నుంచి వస్తున్న మరో బయోపిక్ 'కొండా'. కొండా మురళి - సురేఖ దంపతుల జీవితకథతో రూపొందింది. మురళి పాత్రను త్రిగుణ్ పోషించగా.. సురేఖ పాత్రలో ఇర్రా మోర్ నటించింది. ఈ సినిమా ఈనెల 23న విడుదల కానుంది.
"ఈ సినిమాలో కొండా దంపతుల కాలేజీ జీవితం నుంచి రాజకీయ రంగ ప్రవేశం వరకు జరిగిన ప్రయాణాన్ని చూపించాం. 1990 నుంచి 2000 సంవత్సరం వరకు జరిగే కథగా ఉంటుంది. నేను ఇతరుల నుంచి తెలుసుకున్న సమాచారంలో నమ్మినవి, నాకు నిజంగా అనిపించినవి దీంట్లో చెప్పాను" అంటూ వర్మ చెబుతున్నారు.
సమ్మతమా.. సతమతమా..: 'రాజావారు రాణిగారు'తో కథానాయకుడిగా పరిచయమై 'ఎస్.ఆర్. కళ్యాణమండపం'తో మంచి విజయాన్ని సొంతం చేసుకున్నారు నటుడు కిరణ్ అబ్బవరం. ప్రస్తుతం ఆయన నటిస్తోన్న చిత్రం 'సమ్మతమే'. గోపీనాథ్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. చాందినీ చౌదరి కథానాయిక. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 24న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది.
"రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న చిత్రమిది. కిరణ్ అబ్బవరం, చాందిని చౌదరి జోడీ మధ్య కెమిస్ట్రీ చాలా బాగుంటుంది. మంచి అనుభూతిని పంచే చిత్రంగా ప్రేక్షకుల మనసుల్లో నిలిచిపోతుంద"ని సినీ వర్గాలు తెలిపాయి. శేఖర్ చంద్ర ఈ సినిమాకు సంగీత దర్శకుడు. యు.జి.ప్రొడక్షన్స్ పతాకంపై కంకణాల ప్రవీణ నిర్మిస్తున్నారు.
'చోర్ బజార్'లో ఏం జరిగింది?: ప్రముఖ దర్శకుడు పూరి జగన్నాథ్ తనయుడు ఆకాశ్ పూరి హీరోగా తెరకెక్కిన చిత్రం 'చోర్ బజార్'. బి.జీవన్ రెడ్డి దర్శకుడు. గెహన సిప్పీ కథానాయిక. ఈ విభిన్న కథా చిత్రం జూన్ 24న ప్రేక్షకుల ముందుకురానుంది. చోర్ బజార్ ముడిపడిన కథతో ఈ సినిమాను రూపొందించారు. ఈ కథని 35 రోజులపాటు రాత్రిళ్లే తెరకెక్కించడం విశేషం. యాక్షన్ ఎపిసోడ్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని చిత్ర బృందం చెబుతోంది. మరి 'చోర్ బజార్'లో ఏం జరిగిందో తెలియాలంటే సినిమా చూడాల్సిందే. వి.ఎస్.రాజు నిర్మించిన ఈ సినిమాకు సురేశ్ బొబ్బలి సంగీతం అందించారు.
ఎంఎస్ రాజు ఈ సారి ఏం చూపించబోతున్నారు?: 'వాన'తో దర్శకుడిగా మారి 'డర్టీ హరి'తో ఇండస్ట్రీలో హాట్‌టాపిక్ అయ్యారు ప్రముఖ నిర్మాత ఎం.ఎస్. రాజు. ఇప్పుడాయన దర్శకత్వంలో తెరకెక్కిన యూత్‌ఫుల్ రొమాంటిక్ చిత్రం '7 డేస్ 6 నైట్స్'. సుమంత్ అశ్విన్, మెహర్ చాహల్ నాయకానాయికలు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 24న థియేటర్‌లలో ప్రేక్షకుల ముందుకు రానుంది. యువతకు కనెక్టు చేసేలా సినిమా ఉంటుందని, 20-20 మ్యాచ్‌లా అలరిస్తుందని దర్శకుడు ఎమ్మెస్ రాజు చెబుతున్నారు.
అందమైన ప్రేమ కథతో..: లంకా ప్రతీక్ ప్రేమ్ కుమార్ హీరోగా నటిస్తూ.. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన చిత్రం 'సదా నన్ను నడిపే'. లంకా కరుణాకర్ దాస్ నిర్మాత. వైష్ణవి పట్వర్దన్ కథానాయిక. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూన్ 24న థియేటర్‌లో విడుదల కానుంది. 'గీతాంజలి', 'ప్రేమించుకుందాం రా'.. తరహాలో మంచి అందమైన ప్రేమకథతో ఈ చిత్రం రూపొందిందని ప్రతీక్ చెబుతున్నారు. యాక్షన్, కామెడీ, రొమాన్స్.. అన్ని సమపాళ్లలో రంగరించి ఈ సినిమాను తీర్చిదిద్దినట్లు చెబుతున్నారు.
గంగరాజు వస్తున్నాడు: లక్ష్ చదలవాడ కథానాయకుడిగా నటించిన చిత్రం 'గ్యాంగ్‌స్టర్ గంగరాజు'. ఇషాన్ సూర్య దర్శకత్వం వహించారు. చదలవాడ పద్మావతి నిర్మాత. వేదిక దత్ కథానాయిక. ఈ చిత్రాన్ని జూన్ 24న తెలుగు, తమిళ భాషల్లో విడుదల చేస్తున్నారు నిర్మాత. "ప్రేక్షకుల్ని థ్రిల్‌కి గురిచేసే కథ ఇది. అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా చిత్రాన్ని తీర్చిదిద్దారు దర్శకుడు. ఇప్పటికే విడుదలైన ప్రచార చిత్రాలకి చక్కటి స్పందన లభించింది" అని చిత్ర వర్గాలు చెబుతున్నాయి. సంగీతం: సాయికార్తీక్.
వివాహ బంధంలోని గొప్పతనం..: మనల్ని నవ్విస్తూ, ఏడిపిస్తూ వివాహ బంధంలోని గొప్పతనాన్ని చెప్పడానికి 'జుగ్ జుగ్ జియో' చిత్ర బృందం సిద్ధమైంది. అనిల్ కపూర్, నీతూ కపూర్, వరుణ్ ధావన్, కియారా అడ్వాణీ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. రాజ్ మెహతా దర్శకుడు. జూన్ 24న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. రెండు వేర్వేరు తరాలకు చెందిన జంటలు తమ వివాహ బంధంలో వచ్చిన ఒడుదొడుకులను ఎదుర్కొని ప్రేమను ఎలా గెలుచుకున్నారన్న నేపథ్యంతో ఈ చిత్రం తెరకెక్కింది. వీటితో పాటు, తెలుగులో 'కరణ్ అర్జున్', 'సాఫ్ట్‌వేర్ బ్లూస్' తదితర చిత్రాలు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాయి.
ఈ వారం ఓటీటీలో వచ్చే చిత్రాలివే!
అద్దె చెల్లించకుండా 'సర్కారువారి పాట': మహేశ్‌బాబు కథానాయకుడిగా పరశురామ్ తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్‌టైనర్ 'సర్కారు వారి పాట'. కీర్తిసురేశ్ కథానాయిక. మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం అద్దె ప్రాతిపదికన అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉన్న సంగతి తెలిసిందే. రూ.199 చెల్లించి సినిమాను చూడొచ్చు. కాగా, జూన్ 23వ తేదీ నుంచి ఆ అద్దె కూడా చెల్లించకుండా అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రైబర్లు ఉచితంగా ఈ సినిమాను చూడొచ్చు.
ఓటీటీలో విడుదలయ్యే మరికొన్ని చిత్రాలు/వెబ్‌సిరీస్‌లు
నెట్‌ఫ్లిక్స్
- లవ్ అండ్ గెలాటో (హాలీవుడ్) జూన్22
- కుట్టవుమ్ శిక్షాయుమ్ (మలయాళం) జూన్ 24
- మనీ హెయిస్ట్(కొరియన్)జూన్ 24
- గ్లామర్ గాళ్స్ (హాలీవుడ్) జూన్ 24
డిస్నీ+హాట్‌స్టార్
- డాక్టర్ స్ట్రేంజ్ (తెలుగు ) జూన్22
సోనీలివ్
- నెంజుకు నీది (తమిళ) జూన్ 23
- అవరోధ్(హిందీ సిరీస్ )జూన్24
ఆహా
- మన్మథ లీల(తెలుగు) జూన్24
వూట్
- దూన్‌కాండ్ (హిందీ సిరీస్ ) జూన్20
జీ5
- ఫొరెన్సిక్ (హిందీ) జూన్ 24
ఇదీ చూడండి: రణ్‌బీర్ పోస్టర్‌పై ఆలియా 'హాట్' కామెంట్.. ఆసక్తికరంగా '7 డేస్ 6 నైట్స్' ట్రైలర్