Mahesh babu Sarkaru vaari paata: "స్టార్ హీరోతో పని చేస్తున్నప్పుడు ఒత్తిడి ఏమీ ఉండదు. ఒక పాటను మించిన పాట అందివ్వాలని పట్టుదల ఉంటుంది. దానికోసం నేనెంత కష్టానికైనా వెనుకాడను" అన్నారు ప్రముఖ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. ఆయన ప్రస్తుతం 'సర్కారు వారి పాట'లోని కళావతి, పెన్నీ, టైటిల్ పాటలకు నృత్యరీతులు అందించారు. మహేష్‌బాబు కథానాయకుడిగా నటించిన చిత్రమిది. పరశురామ్ తెరకెక్కించారు. కీర్తి సురేష్ కథానాయిక. ఈ సినిమా ఈనెల 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర విశేషాలు పంచుకున్నారు శేఖర్ మాస్టర్. ఆ సంగతులు..
ఓ పాట విజయంలో కొరియోగ్రఫీ పాత్ర ఎంత ఉంటుంది? పాట విషయంలో దర్శకులకు మీరెలాంటి సలహాలిస్తారు?
"కొరియోగ్రఫీది కీలకమైన పాత్రే. అయితే ముందు సంగీత దర్శకుడి నుంచి మంచి ట్యూన్ రావాలి. దానికి అందంగా కొరియోగ్రఫీ కుదిరితే పాట విజయవంతం అవుతుంది. సాంగ్‌ని అందంగా చూపించాల్సిన బాధ్యతా మాపై ఉంటుంది. మూమెంట్స్‌తో పాటు పాటలో కనిపించే ప్రాపర్టీస్, కాస్ట్యూమ్స్.. ఇలా ప్రతి దానిపైనా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. కొన్నిసార్లు ఈ విషయంలో దర్శకులు మాకు సూచనలు ఇస్తారు. కొన్నిసార్లు మేమే ఎలా ఉంటే బాగుంటుందో చెబుతాం. 'కళావతి' గీతాన్ని ఫారిన్‌లో షూట్ చేశాం. బ్యాగ్రౌండ్‌లో సితారలు ఉంటే బాగుంటుంది అనిపించింది. పరశురామ్‌కు చెబితే ఓకే అన్నారు. కాస్త ఖర్చు ఎక్కువైనా అప్పటికప్పుడు వేరే చోట నుంచి వాటిని తెప్పించి పాట పూర్తి చేశాం".
కొరియోగ్రఫీలో ఇప్పుడు ఏ ట్రెండ్ నడుస్తోంది?
"ఇప్పుడు పాన్ ఇండియా అంటున్నారు కానీ, 'ఇద్దరమ్మాయిలతో'లోని టాపు లేచిపోద్ది పాటను అప్పట్లోనే ప్రపంచ వేదికలపై ప్రదర్శించారు. 'అల.. వైకుంఠపురములో', 'పుష్ప' మూమెంట్స్ పాన్ వరల్డ్‌లో సందడి చేశాయి. మూమెంట్ విభిన్నంగా, క్యాచీగా ఉంటే జనాల దృష్టి ఆటోమేటిక్‌గా పాటపై పడుతుంది. ఒక పాటలో అందరూ చేయగలిగే రెండు యూనిక్ స్టెప్స్ ఉంటే చాలు.. అది సోషల్ మీడియా రీల్స్‌లోకి వెళ్లి హిట్ అవుతున్నాయి".
ఓ డ్యాన్స్ మాస్టర్‌గా మీకు బాగా నచ్చే హీరో ఎవరు?
"నేను పని చేసే ప్రతి హీరో నాకు దేవుడితో సమానం. నన్ను నమ్మి పాట ఇస్తున్నారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టడానికి కష్టపడి పని చేయడం ఒక్కటే నాకు తెలుసు. ఏ హీరో అయినా సరే ఒక్కసారి చెప్పిన వెంటనే మూమెంట్స్ పట్టేస్తారు. ఎన్టీఆర్ మాత్రం రిహార్సల్స్ లేకుండానే స్పాట్‌లో స్టెప్ చూసి, చేసేస్తారు. ప్రస్తుతం తమిళంలో శింబు, శివకార్తికేయన్ సినిమాలు చేస్తున్నా. తెలుగులో చిరు154, రవితేజ 'ధమాకా' చిత్రాలకు చేస్తున్నా. రాజమౌళి, పవన్ కల్యాణ్‌ల కోసం పని చేయాలని ఉంది".
'సర్కారు వారి పాట'లో పాటలెలా ఉంటాయి? మహేష్‌తో పని చేయడం ఎలా అనిపించింది?
"ఈ సినిమాలో నేను 'కళావతి', 'పెన్నీ' గీతాలతో పాటు మరో మాస్ పాటకు నృత్యరీతులు అందించా. ఇవన్నీ వేటికవే ప్రత్యేకంగా ఉంటాయి. త్వరలో రానున్న మాస్ పాట ఫ్యాన్స్‌కు గొప్ప ట్రీట్. ఆయన సిగ్నేచర్ మూమెంట్స్ నెక్ట్స్ లెవెల్‌లో ఉంటాయి. స్వతహాగానే మహేష్‌లో అద్భుతమైన రిథమ్ ఉంది. డ్యాన్స్ విషయానికొస్తే ఈ సినిమాలో సరికొత్త మహేష్‌బాబును చూస్తారు".
ఇదీ చూడండి: పొట్టి పింక్ డ్రెస్‌లో సమంత... చూస్తే హీటెక్కడం పక్కా..!